బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభం కావడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మార్కెట్ సూచీల నష్టాలకు పూర్తిగా ఎన్నికల ఫలితాలే కారణం కాదని గమనించాలి. అయితే దీని ప్రభావం కొంత ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఒక ముఖ్యమైన రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ.. మార్కెట్‌లోని అస్థిరతకు కొంత కారణం కావొచ్చని చెబుతున్నారు. రాజకీయ ఫలితాల సమయంలో స్టాక్ మార్కెట్‌లో ఈ తరహా ఒడిదొడుకులు కొత్తేమీ కాదు. గతంలో జరిగిన చాలా ఎన్నికల్లోనూ స్టాక్ సూచీలు ఒడిదొడుకులకు లోనయ్యాయి.
గత ఎన్నికల ఫలితాల సమయంలో..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థిరమైన మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందనే స్పష్టమైన అంచనాలతో ఫలితాల ప్రకటనకు ముందు నుంచే మార్కెట్‌లో ర్యాలీ కనిపించింది. ఫలితాల రోజున కూడా మార్కెట్ పరుగులు తీసింది. పెట్టుబడిదారుల్లో ఒక ఆశాభావం, విధానపరమైన స్థిరత్వంపై నమ్మకం పెరగడమే దీనికి కారణం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి మళ్లీ పూర్తి మెజారిటీ దక్కుతుందని స్పష్టమైన సంకేతాలు అందడంతో మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ తర్వాత, ఫలితాల రోజున కూడా సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలబాట పట్టాయి. స్థిరమైన ప్రభుత్వం, ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయనే అంచనా దీనికి ఊతమిచ్చింది.
2004 ఎన్నికల సమయంలో అప్పటి పాలక సంకీర్ణ కూటమి ఓడిపోయి కొత్త ప్రభుత్వం అనూహ్యంగా ఏర్పడడంతో స్టాక్ మార్కెట్‌లో తీవ్రమైన పతనం నమోదైంది. రాజకీయ అస్థిరత, కొత్త విధానాల పట్ల భయాలు మార్కెట్‌ను కుదిపేశాయి.
ఈ ఉదాహరణలను బట్టి చూస్తే ఎన్నికల ఫలితం స్థిరమైన సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని ఇస్తే మార్కెట్ సాధారణంగా సానుకూలంగా స్పందిస్తుంది. అదే అనిశ్చితి, సంకీర్ణాల పట్ల భయాలు ఉంటే మార్కెట్ నష్టాలను చవిచూస్తుంది.
మార్కెట్ ఎందుకు ఒడిదొడుకులకు లోనవుతుంది?
ఎన్నికల ఫలితం తరువాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే దానిపై ఆధారపడి ఆ ప్రభుత్వం తీసుకునే ఆర్థిక విధానాలు మారుతుంటాయి. కొన్ని ప్రభుత్వాలు వ్యాపార అనుకూల సంస్కరణలు (ఉదాహరణకు, పన్నుల తగ్గింపు, పెట్టుబడుల ప్రోత్సాహం) తీసుకురావచ్చు. ఇది మార్కెట్‌కు సానుకూలం. మరికొన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పెంచవచ్చు. ఇది ఆర్థిక లోటు పెరగడానికి దారితీసి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఫలితం స్పష్టంగా లేకపోతే ఎటువంటి విధానాలు అమలు చేస్తారనే దానిపై సందేహం కారణంగా పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు.
పెట్టుబడిదారుల సెంటిమెంట్
స్టాక్ మార్కెట్ అనేది కేవలం ఆర్థిక గణాంకాలపైనే కాకుండా భావోద్వేగాలు, అంచనాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ఫలితాల పట్ల మార్కెట్ వర్గాలు సానుకూలంగా ఉంటే (స్థిర ప్రభుత్వం వస్తుందనే నమ్మకం) స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. తద్వారా ధరలు పెరుగుతాయి. ప్రతికూలత లేదా అనిశ్చితి నెలకొంటే నష్టాల భయంతో స్టాక్స్‌ను విక్రయించడం ప్రారంభిస్తారు.
ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు


