ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం
విజయంపై రెండు కూటముల ధీమా
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇవ్వబోయే తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ ముగిసే సమయం వచ్చేసింది. శుక్రవారమే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సీనియర్ నేత, అనుభవజు్ఞడు నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేక యువ నాయకుడు తేజస్వీ యాదవ్ అధికార పీఠం అధిరోహిస్తారా? అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
బిహార్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. 38 జిల్లాల్లో మొత్తం 46 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి ఎన్నికల్లో ఏకంగా 2,616 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఈ నెల 6, 11న.. రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 67.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది. బిహార్ ఎన్నికల చరిత్రలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్ర పరిశీలకులు, అభ్యర్థుల తరపు ఏజెంట్ల సమక్షంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది.
ఎన్డీయేకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
బిహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ మధ్య పోటీ నెలకొంది. విజయం తమదేనని రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడానికి సొంత భాష్యం చెబుతున్నాయి. తమ పాలన పట్ల ప్రజల్లో సానుకూలతకు ఇది నిదర్శనమని ఎన్డీయే వాదిస్తుండగా, నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారని మహాగఠ్‌బంధన్ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.
మరోవైపు చివరి నిమిషంలో పారీ్టలన్నీ ఫలితాల లెక్కల్లో మునిగితేలాయి. గురువారం చర్చోపచర్చలు సాగించాయి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆర్జేడీ అగ్రనేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ విజ్ఞప్తిచేశారు. ఎవరైనా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరిగితే, అధికార కూటమిని అక్రమాలకు పాల్పడితే నేపాల్ తరహాలో బిహార్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆర్జేడీ నాయకుడు సుశీల్‌కుమార్ సింగ్ తేల్చిచెప్పారు. జనం ఈసారి మార్పు కోరుకున్నారని, తేజస్వీ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని తేల్చిచెప్పారు.
ఓటర్లను కించపరుస్తున్నారు: బీజేపీ
ఎన్నికల ఫలితంపై మహాగఠ్‌బంధన్ పెద్దలకు ఇప్పటికే స్పష్టత వచ్చేసిందని, వారంతా నిరాశలో మునిగిపోయి ఓటర్లను కించపరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ బిహార్ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ విమర్శించారు. ఎన్డీయే జనరంజక పాలనకు మరోసారి పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. రెండు దశల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఓట్ల లెక్కింపు కూడా అదేవిధంగా సాగుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకొనేందుకు బిహార్ ప్రజలు కట్టబడి ఉన్నారని దిలీప్ జైస్వాల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్డీయే మళ్లీ విజయం సాధించి, నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయితే సరికొత్త ఘనత సాధిస్తారు. బిహార్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి నాయకుడిగా రికార్డుకెక్కుతారు. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం ఈసారి పోటీకి దిగింది. ఉనికి చాటుకొనేందుకు బాగానే కష్టపడింది. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, సున్నా నుంచి రెండు మూడు సీట్ల దాకా రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.


