ఆటో, ఐటీ స్టాక్స్‌ దన్ను

Losses In The BSE Midcap And BSE Small Cap - Sakshi

ఒకటిన్నర శాతం లాభపడ్డ ప్రధాన సూచీలు

సానుకూలించిన అంతర్జాతీయ సంకేతాలు

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ బుల్లిష్‌ ధోరణి నెలకొంది. మంగళవారం రోజంతా సానుకూలంగా ట్రేడ్‌ కావడంతోపాటు ఒకటిన్నర శాతం వరకు ప్రధాన సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ధోరణి ఉండగా, దేశీయంగా ఇన్వెస్టర్లు ఐటీ, ఆటో, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు దిగడం భారీ లాభాలకు దారితీసింది. వరుసగా ఐదు రోజుల కన్సాలిడేషన్‌ తర్వాత మార్కెట్లు సానుకూల బ్రేకవుట్‌ ఇచ్చాయి.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారం మరిన్ని వృద్ధి కారక నిర్ణయాలను ప్రకటించొచ్చన్న అంచనాలతో క్రితం రోజు అమెరికా మార్కెట్లు లాభపడగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రధాన సూచీల్లో ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్, ఓఎన్‌జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. టీసీఎస్, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఎంఅండ్‌ఎం, మారుతి, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, బజాజ్‌ ఆటో గణనీయంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. జూన్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7 శాతానికి పైగా పెరిగి సెన్సెక్స్‌కు మద్దతుగా నిలిచింది.

మిడ్, స్మాల్‌క్యాప్‌లో నష్టాలు.. 
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కీలకమైన 38,000 మార్క్‌ పైన ట్రేడింగ్‌ ఆరంభించగా.. ఇంట్రాడేలో 38,555 వరకు వెళ్లింది. చివరకు 558 పాయింట్లు లాభపడి (1.47 శాతం) 38,493 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో (1.52 శాతం) 11,300 మార్క్‌పైన క్లోజయింది. బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ఆటో రంగ సూచీ 3.26 శాతం, ఐటీ 2.54 శాతం, బేసిక్‌ మెటీరియల్స్‌ 2.32 శాతం, టెక్‌ 2.18 శాతం చొప్పున లాభపడ్డాయి. కానీ, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 0.61 శాతం, మిడ్‌క్యాప్‌ 0.76 శాతం, లార్జ్‌క్యాప్‌ 1.46 శాతం చొప్పున నష్టపోయాయి. ‘‘దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు 1.4 శాతం మేర లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ స్టాక్స్‌ అధిక లాభాలకు కారణమయ్యాయి. కొన్ని స్టాక్స్‌ వాటి ఫలితాల ఆధారంగా ర్యాలీ చేశాయి.

యూఎస్‌ ఫెడ్‌ తన డోవిష్‌ పాలసీ విధానాన్ని కొనసాగిస్తుందన్న అంచనాలు అంతర్జాతీయంగా నెలకొని ఉన్నాయి. ఇది లిక్విడిటీ కొనసాగేలా చేస్తుంది. ముఖ్యంగా భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగేలా చేస్తుంది. మార్కెట్ల పనితీరుకు లిక్విడిటీయే చోదకంగా ఉంది. కనుక ఫెడ్‌ నిర్ణయం సానుకూలంగా దోహదం చేయనుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.  
లాభాల రిలయన్స్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌లో సానుకూల సెంటిమెంట్‌ కొనసాగుతూనే ఉంది. మరొక శాతం లాభపడి ఈ స్టాక్‌ బీఎస్‌ఈలో 2177.45 వద్ద క్లోజయింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.13,80,373 కోట్లుగా ఉంది.

విశ్లేషకులు ఏమంటున్నారు..?
‘‘గత ప్రారంభంలో ఎగువవైపునున్న అంతరం 11,245, అదే విధంగా మార్చి 6 నాటి ఆరంభ దిగువవైపు అంతరాన్ని సూచీలు పూర్తి చేసేశాయి. సమీప కాలంలో మరింత అప్‌సైడ్‌కు ఇది సంకేతంగా కనిపిస్తోంది. నిఫ్టీ–50కి ఫిబ్రవరి 28 నాటి డౌన్‌గ్యాప్‌ ఓపెనింగ్‌ 11385–11535 శ్రేణి నిరోధంగా వ్యవహరిస్తుంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి తెలిపారు. ‘‘నిఫ్టీ–50 తక్షణ నిరోధ స్థాయి 11,250కు ఎగువన క్లోజయింది. అంతేకాదు గత 89 ట్రేడింగ్‌ సెషన్లలో అత్యధిక రోజువారీ ముగింపు ఇది. ఇండెక్స్‌ సంబంధించి అధిక శాతం ధోరణి సానుకూలంగానే ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top