లోన్‌ ఫ్రాడ్‌ కేసు: చందా కొచ్చర్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు

Loan Fraud Case: Chanda kochhar Granted bail By Bombay High Court - Sakshi

ముంబై: వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. చందాతో పాటు ఆమె భ‌ర్త‌ దీపక్‌ కొచ్చర్‌ను సైతం రిలీజ్ చేయాల‌ని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. అరెస్ట్‌ చట్టానికి లోబడి జరగలేదని చందా కొచ్చర్‌ తరపు న్యాయవాదులు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. 

వీడియోకాన్ సంస్థ‌కు అక్ర‌మ‌రీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. చందా కొచ్చారోతో పాటు ఆమె భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌ను డిసెంబ‌ర్ 23వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థ‌కు 2012లో సుమారు రూ. 3,250 కోట్ల మొత్తాన్ని అక్ర‌మ‌రీతిలో లోన్ ఇప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.కుటుంబ ల‌బ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్‌గా ప్ర‌క‌టించారు.

బాంబే హైకోర్టులో జ‌స్టిస్ రేవ‌తి మోహితే దేరే, జ‌స్టిస్ పీకే చావ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమిన‌ల్ కోడ్‌లోని 41ఏ సెక్ష‌న్‌ను ఉల్లంఘించి ఆ ఇద్ద‌రి అరెస్టు చేసిన‌ట్లు కోర్టు తెలిపింది.  జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న ఇద్దరినీ.. ల‌క్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై విడిచిపెట్ట‌నున్నారు.

కొచ్చర్‌ల పేరుతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ దూత్‌ పేరును సైతం సీబీఐ ఇందులో చేర్చింది. క్విడ్‌ ప్రోకోలో భాగంగా ఇదంతా జరిగిందని అభియోగాలు నమోదు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top