జూన్‌లోనూ జీవిత బీమా జోరు

Life insurers report 4percent rise in new year premium in June at Rs 30,009 crore - Sakshi

నూతన ప్రీమియంలో 4 శాతం వృద్ధి

తగ్గుతున్న ఎల్‌ఐసీ ఆధిపత్యం

ఆదాయంలో 4 శాతం డౌన్‌  

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూన్‌లోనూ మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల నుంచి వచ్చే మొదటి ఏడాది ప్రీమియం(న్యూ బిజినెన్‌ ప్రీమియం)లో 4% వృద్ధి నమోదైంది. ఈ రూపంలో రూ.30,009 కోట్ల ఆదాయం వచ్చినట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది జూన్‌ నెలలో అన్ని జీవిత బీమా కంపెనీల కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.28,869 కోట్లుగా ఉండడం గమనార్హం.

దేశంలో 24 జీవితబీమా కంపెనీలుండగా.. ఎల్‌ఐసీ అతిపెద్ద మార్కెట్‌ వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ఎల్‌ఐసీ నూతన ప్రీమియం ఆదాయం ఈ ఏడాది జూన్‌లో 4.14 శాతం పడిపోయింది. 2020 జూన్‌లో కొత్త పాలసీల రూపంలో రూ.22,737 కోట్ల మేర ప్రీమియం ఆదాయం ఎల్‌ఐసీకి సమకూరగా.. 2021 జూన్‌లో ఆదాయం రూ.21,796 కోట్లకు పరిమితమైంది. మిగిలిన 23 ప్రైవేటు  జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీల రూపంలో ఆదాయం 34% పెరిగి రూ.6,132 కోట్ల నుంచి రూ.8,213 కోట్లకు చేరుకుంది.  

జూన్‌ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి...
ఈ ఏడాది (2021–22) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలోనూ 24 జీవిత బీమా సంస్థల నూతన వ్యాపార ప్రీమియం 7% పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే) రూ.53,725 కోట్లుగా నమోదైంది. ఎల్‌ఐసీ వరకే చూస్తే తొలి త్రైమాసికంలో ప్రీమియం ఆదాయం 2.54% తగ్గి రూ.25,601 కోట్లుగా ఉంది. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల తొలి ప్రీమియం ఆదాయం జూన్‌ క్వార్టర్‌లో 34% వృద్ధితో రూ.17,124 కోట్లుగా నమోదైంది.

2021 జూన్‌ నాటికి మొత్తం జీవిత బీమా కవరేజీ (సమ్‌ అష్యూర్డ్‌) పరంగా చూస్తే ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 12.55%గా ఉంటే, మిగిలిన 23 జీవిత బీమా కంపెనీలకు సంబంధించి సమ్‌ అష్యూర్డ్‌ 87.45%. ఎల్‌ఐసీ ఎక్కువగా ఎండోమెంట్‌ పాలసీలను విక్రయిస్తుంటుంది. వీటిపై జీవిత బీమా కవరేజీ తక్కువగా ఉండడం వల్లే ఇంత అంతరం కనిపిస్తోంది. ప్రొటెక్షన్‌ పాలసీల్లో (టర్మ్‌ప్లాన్లు) ప్రైవేటు బీమా సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంటోంది. జీవిత బీమా అంటేనే.. జీవితానికి రక్షణ కల్పించేదని అర్థం. ఇందుకు ఉదాహరణ టర్మ్‌ ప్లాన్లు. కానీ, నామమాత్రపు కవరేజీనిస్తూ.. 4–5% రాబడులిచ్చే ఎండోమెంట్‌ ప్లాన్లనే ఇప్పటికీ ఎక్కువ మంది తీసుకోవడం గమనార్హం.

సాధారణ బీమా సైతం వృద్ధి పథమే  
సాధారణ బీమా సంస్థల (జీవిత బీమా కంపెనీలు కాకుండా) స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం జూన్‌ నెలలో 7 శాతం వృద్ధితో రూ14,809 కోట్లుగా నమోదైంది. దేశంలో 32 సాధారణ బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి క్రితం ఏడాది జూన్‌లో రూ.13,842 కోట్ల స్థూల ప్రత్యక్ష ఆదాయాన్ని పొందడం గమనార్హం. 25 సాధారణ బీమా సంస్థలకు సంబంధించి ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 5 శాతం పెరిగి రూ.13,041 కోట్లుగా ఉంది. ఐదు స్టాండలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల ప్రీమియం ఆదా యం ఏకంగా 47 శాతం వృద్ధితో రూ.1,557 కోట్లకు చేరుకుంది. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంతో.. వీటిని తీసుకునే వారు పెరుగుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top