
భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, దీర్ఘకాలిక పొదుపునకు, రిటైర్మెంట్ అనంతరం ఆదాయానికి హామీనిచ్చే సాధనంగా జీవిత బీమా అవసరంపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీనితో పరిశ్రమ కూడా వృద్ధి చెందుతోంది. జీవిత బీమా సంస్థలు టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్లకు సరళతరమైన సాధనాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ జీవిత బీమాపై కొన్ని అపోహలు ఉంటున్నాయి. అందరికీ బీమా భద్రత లక్ష్యం సాకారం కావాలంటే వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమతో పాటు తమకెంతో ప్రియమైన వారికి ఆర్థిక భద్రత కల్పించనివ్వకుండా వెనక్కు లాగుతున్న అపోహల్లో కొన్నింటిని చూస్తే..
అపోహ 1: యువతకు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు
కొత్తగా ఆర్జన ప్రారంభించిన యువతలో చాలా మంది అప్పుడే తాము జీవిత బీమా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ వీలైనంత ముందుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభిస్తుంది. ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి కూడా పటిష్టమైన పునాది ఏర్పడుతుంది. అందుకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించి తొందరగా రిటైర్ అవ్వాలనుకునే కొత్త తరం యంగ్‌స్టర్స్ కోసం జీవిత బీమా సంస్థలు ప్రత్యేకంగా పలు సేవింగ్స్ ప్రోడక్టులను ప్రవేశపెట్టాయి. అత్యంత తక్కువగా నెలకు రూ. 1,000 నుంచి ప్రారంభమయ్యే ఇన్వెస్ట్‌మెంట్ ఆధారిత పథకాలను అందిస్తున్నాయి.
అపోహ 2: ఇది అర్థం కాని సంక్లిష్టమైన వ్యవహారం
మొబైల్ ఆధారిత ప్లాట్‌ఫాంలు, డిజిటల్ ప్రక్రియలు, అదే రోజున పాలసీ జారీ తదితర అంశాల దన్నుతో జీవిత బీమాను అర్థం చేసుకోవడం, కొనుగోలు చేయడం నేడు మరింత సులభతరంగా ఉంటోంది. ఒకప్పుడు సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపించిన ఈ ప్రక్రియ ప్రస్తుతం భాష, పథకాలపరంగా కూడా చాలా సరళంగా మారింది.
అపోహ 3: క్లెయిమ్‌లు సెటిల్మెంట్ కష్టం
దేశీయంగా చాలా మటుకు జీవితబీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి స్థిరంగా 98 శాతం నుంచి 99 శాతం స్థాయిలో ఉంటోంది. కొన్ని సంస్థలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్‌లను, అన్ని పత్రాలు అందిన మరుసటి రోజే సెటిల్ చేస్తున్నాయి.
అపోహ 4: ఇది చాలా ఖరీదైన, తాహతుకు మించిన వ్యవహారం
పొగ తాగని ఓ 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే, రోజుకు రూ. 30 కన్నా తక్కువే ప్రీమియం ఉంటుంది. ఇది కెఫేలో కాఫీ ఖరీదు కన్నా తక్కువే. అంతేగాకుండా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, పాలసీదారుపై ఆధారపడిన వారికి ఆదాయ భర్తీ సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గృహ రుణంలాంటి ఆర్థిక రుణభారాలను క్లియర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది.
అపోహ 5: మరణానంతరం మాత్రమే ఉపయోగకరం
కొత్త తరహా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు, పాలసీదార్లకు జీవితకాలంలోనే పలు ప్రయోజనాల అందించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ తీసుకుంటే, నిర్దిష్ట అనారోగ్యాల చికిత్సకయ్యే ఖర్చులను చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా కుటుంబ అవసరాల కోసం దాచిపెట్టే పొదుపు మొత్తాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా పలు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడే స్మార్ట్ సాధనంగా ఉంటోంది. దేశం ఆర్థిక సమ్మిళితత్వం వైపుగా వెళ్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన అపోహల నుంచి బైటపడాల్సిన సమయమిది. ఈ క్రమంలోనే ప్రజలు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో సహాయకరంగా ఉండే సరళమైన పథకాలను, ప్రక్రియలను అందించడంపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింతగా దృష్టి పెడుతోంది.

ఇదీ చదవండి: జాయింట్ ఖాతాకు నామినీ అవసరమా..?