
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. వీటిని మెరుగైన రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది యోచన. ఇందుకు ఎలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి? – వైశాలి సురేంద్రన్
ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై అధిక రాబడి కోరుకోవడం సహజం. కానీ ఇన్వెస్టర్‌గా మీ లక్ష్యం గరిష్ట రాబడి ఒక్కటే కాకూడదు. రిస్క్‌ను కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దృష్ట్యా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి సాధనంలోనూ ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ అది కచ్చితం అని చెప్పలేం. ప్రతికూల పరిస్థితుల్లో స్వల్పకాలంలో నష్టాలనూ ఇస్తాయి. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు.
మనకు పెట్టుబడులు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్‌కు లోనైతే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్‌్కను అధిగమించేందుకు డెట్ సాధనాల్లోనూ కొంత మేర ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులు ఐదేళ్లు, అంతకుమించిన కాలానికి ఉండాలి. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడుల వ్యూహమైన అస్సెట్ అలోకేషన్‌ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడంతోనే పని ముగిసినట్టు కాదు. తప్పకుండా ఏడాదికోసారి వాటి పనితీరు ఎలా ఉందన్నది తప్పకుండా సమీక్షించుకోవాలి. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి.
ఎనీవన్ లేదా సర్వైవర్ అనే ఆప్షన్‌తో ఉన్న జాయింట్ బ్యాంక్ ఖాతాకు నామినీ నమోదు అవసరమా? – జోషి భవేరా
బ్యాంక్ ఖాతా అయినా, పెట్టుబడి అయినా నామినీ నమోదు చేయడం ఎంతో అవసరం. ఎనీవన్ లేదా సర్వైవర్ బ్యాంక్ ఖాతాని ఇద్దరు కంటే ఎక్కువ మంది నిర్వహించొచ్చు. బ్యాంకింగ్ లావాదేవీలపై ఎవరో ఒకరు సంతకం చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఒక ఖాతాదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే, అప్పుడు ఆ ఖాతాలోని బ్యాలన్స్, వడ్డీని జీవించి ఉన్న ఖాతాదారుకు చెల్లిస్తారు. ఆ తర్వాత అదే ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ఏ ఖాతాదారుడూ జీవించి లేకపోతే, ఆ ఖాతాకు నామినీ నమోదు చేసి లేకపోతే.. అప్పుడు ఖాతాదారుడి వారసులు అన్ని రకాల పత్రాలు సమర్పించిన అనంతరం అందులోని బ్యాలన్స్‌ను క్లెయిమ్ చేసుకోగలరు. నామినీని నమోదు చేయడం వల్ల అనుకోని పరిస్థితుల్లో అవి సాఫీగా బదిలీ అయ్యేందుకు వీలుంటుంది. అందుకని ఎనీవన్ లేదా సర్వైవర్ ఖాతాకు సైతం నామినీ నమోదు చేసుకోవడం అనవసర సమస్యలను తప్పిస్తుంది.
