ఇన్‌స్టామార్ట్‌.. ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే..! | Latest Trend In Swiggy Instamart Online Orders, Vizag Man Places 337 Orders In A Year | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టామార్ట్‌.. ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే..!

Jul 25 2025 9:17 AM | Updated on Jul 25 2025 10:49 AM

Latest Trend In Swiggy Instamart Online Orders

ఆన్‌లైన్‌ ఆర్డర్లలో సరికొత్త ట్రెండ్‌  

ఇన్‌స్టంట్‌ డెలివరీలో వైజాగ్‌ వాసులే ట్రెండింగ్‌ 

ఏడాది కాలంలో 337 ఆర్డర్లు చేసిన విశాఖ వాసి 

మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయంలో అత్యధిక ఆర్డర్లు 

ఇన్‌స్టామార్ట్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: టీ పెట్టాలి..  పాలు లేవా? అయితే ఆర్డర్‌ పెట్టేద్దాం. ఐస్‌క్రీమ్‌ తినాలనిపిస్తోందా? ఆర్డర్‌ చేసేద్దాం. వర్షం పడుతోంది.. వేడివేడి స్నాక్స్‌ కావాలి? ఆర్డర్‌.! ఎక్కడ చూసినా ఇప్పుడు ‘క్లిక్‌.. ఆర్డర్‌’ ట్రెండ్‌ నడుస్తోంది. ఒకప్పుడు చిన్న షాంపూ కావాలన్నా వీధి చివర దుకాణానికి వెళ్లేవాళ్లం. పెరుగు కోసం డెయిరీకి, స్వీట్స్‌ కోసం మిఠాయి షాపుకి.. ఇలా ఏం కావాలంటే అక్కడికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఫాస్ట్‌ డెలివరీ యాప్స్‌ వచ్చాక.. మనకు కావాల్సిన వస్తువు పది నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్‌లైన్‌ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్‌ పెరుగుతోంది. 

వైజాగ్‌లో కూడా క్విక్‌ డెలివరీ యాప్స్‌కు ఆదరణ బాగా పెరిగిందని ‘ఇన్‌స్టామార్ట్‌’ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ వైజాగ్‌ వాసులు ఫాస్టెస్ట్‌ డెలివరీ యాప్స్‌లో ఎక్కువగా ఏం ఆర్డర్‌ చేస్తున్నారో తెలుసా? అదేనండి.. పెరుగు. ఇంకా ఏయే విషయాల్లో వైజాగ్‌ వాసులు ‘ఫాస్ట్‌’గా ఉన్నారో తెలుసుకుందామా? ఉరుకుల పరుగుల జీవనంలో ఇప్పుడు అంతా అరచేతిలోనే జరిగిపోతోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్‌ పెట్టి 10 నుంచి 15 రోజులు వేచి చూసే రోజులు పోయాయి. ఆర్డర్‌ పెట్టిన 15 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అని ఒకరంటే, లేదు లేదు.. 10 నిమిషాల్లోనే మీ ఇంటికి తెస్తాం అని మరొకరు పోటీపడి మరీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పైగా, షాప్‌లలో కూడా లభించని ఆఫర్లతో నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వస్తుండటంతో.. శ్రమ తప్పుతోందని భావించి అంతా ‘క్విక్‌ కామర్స్‌’పైనే ఆధారపడుతున్నారు. 

మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనే అధికం 
ఉదయం పూటతో పోలిస్తే, మధ్యాహ్నం భోజన సమయంలో, అలాగే అర్ధరాత్రి వేళల్లో నగరంలో క్విక్‌ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైపర్‌–ఎఫెక్టివ్‌ డెలివరీ నెట్‌వర్క్‌ మద్దతుతో ఆన్‌లైన్‌ గ్రోసరీ డెలివరీ సంస్థల మధ్య పోటీ తీవ్రమవుతోంది. వీలైనంత త్వరగా వినియోగదారుడికి చేరుకోవాలనే పోటీతో, తక్కువ సమయంలో అందించేందుకు ప్రయత్నింస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో సగటున 10.4 నిమిషాల్లోనే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయి. 

ఈ జూన్‌లో ఇన్‌స్టామార్ట్‌ ఒక ఆర్డర్‌ను కేవలం 2.18 నిమిషాల్లో అందజేసి రికార్డు సృష్టించింది. 2024 జూన్‌ నుంచి 2025 జూన్‌  మధ్య నగరానికి చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా 337 ఆర్డర్లు చేశాడంటే.. ఈ యాప్స్‌ మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకు విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలు పోటీపడుతున్నాయి. అందుకే విశాఖ వాసి ఇల్లు కదలకుండా, తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ ‘స్మార్ట్‌’గా మార్ట్‌ను ఇంటికి తెప్పించుకుంటున్నాడు. వినియోగదారుడి ఆసక్తికి అనుగుణంగా ఆఫర్లతో ఆకట్టుకుంటూ, ఆన్‌లైన్‌ గ్రోసరీ డెలివరీ యాప్స్‌ తమ ఆర్డర్లను గణనీయంగా పెంచుకుంటున్నాయి.

  • ఏమేం ఆర్డర్‌ చేస్తున్నారంటే... 
    ఇన్‌స్టామార్ట్‌ క్విక్‌ కామర్స్‌ యాప్‌.. ఏడాది పాటు విశాఖ నగరంలో చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు
    వెల్లడయ్యాయి. 

  • వైజాగ్‌ ప్రజలు చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే ఉంటున్నాయి. ఫుల్‌ క్రీమ్, టోన్డ్‌ మిల్‌్క, పన్నీర్‌ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు. 

  • తర్వాతి స్థానంలో ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్‌ ఉన్నాయి. వీటి ఆర్డర్లలో ఏడాది కాలంలో 112 శాతం వృద్ధి కనిపించింది. 

  • టమాటాలు, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఉల్లిపాయలు, గుడ్లు, బంగాళాదుంపలు వంటి కూరగాయలనూ ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు.

  • ఉదయం లంచ్‌ బాక్స్‌ కోసం ఏ కూర వండాలో నిర్ణయించుకుని ఆన్‌లైన్‌లో తాజా కూరగాయలకు ఆర్డర్‌ పెడుతున్నారు. తాలింపు సిద్ధం చేసుకునేలోపే.. కూరగాయలు ఇంటికి చేరుతున్నాయి. 

  • వీటితో పాటు వేరుశనగ, కొబ్బరి, లేత కొబ్బరి, ఇడ్లీ రవ్వ వంటి ఉత్పత్తులకు కూడా అధిక డిమాండ్‌ ఉంది. 

  • వివాహ సీజన్‌లో సౌందర్య, వస్త్రధారణ ఉత్పత్తుల ఆర్డర్లు పెరుగుతున్నాయి.  

  • వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో బంగాళాదుంప చిప్స్, ఆలూ భుజియా, పాప్‌కార్న్‌ వంటి స్నాక్స్‌ ఎక్కువగా కొంటున్నారు. 

  • పండగల సమయంలో పండ్లు, కూరగాయలు, పూజా నిత్యావసరాలను ఆర్డర్‌ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement