విశాల్‌ గార్గ్‌ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే..

Laid Off 900 In Zoom CEO Vishal Garg Wanted to give Just Week Salary - Sakshi

Laid Off In Zoom Better CEO Vishal Garg wanted to give one week of severance pay: బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌.. జూమ్‌ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీఈవో గురించి విస్తూపోయే విషయాలు ఇప్పుడు వెలుగు చూశాయి.

విమర్శల నేపథ్యంలో తన నిర్ణయంపై పశ్చాత్తాపం ప్రకటించి..  క్షమాపణలతో పాటు ఉద్యోగుల్ని తొలగించడానికి కారణం సైతం వివరించాడు విశాల్‌ గార్గ్‌. అయినా వ్యవహారం చల్లారకపోవడంతో ఆయన్ని బలవంతపు సెలవుల మీద పంపింది  కంపెనీ.  అంతేకాదు ఈ వ్యవహారంలో సమీప భవిష్యత్తులో ఆయనపై వేటు తప్పదని హింట్‌ కూడా అందించింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల్ని తొలగించే ముందు విశాల్‌ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో వెలుగు చూసింది ఇప్పుడు. 

బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం.. మోర్టగేజ్‌ లెండింగ్‌ కంపెనీ బెటర్‌ డాట్‌ కామ్‌ ‘లే ఆఫ్‌’ ప్రకటన కంటే ముందు విశాల్‌ తన ఆధ్వర్యంలో డజనుకి పైగా మీటింగ్‌లు జరిపాడట. ఆ సమావేశంలో తొలగించబోయే ఉద్యోగులకు కేవలం వారం, మరీ కాదంటే రెండు వారాల జీతం మాత్రమే (severance pay) చెల్లించాలన్న ప్రతిపాదన చేశాడట విశాల్‌. విశేషం ఏంటంటే.. అప్పటికీ బెటర్‌ డాట్‌ కామ్‌ బోర్డు ఇంకా తొలగింపులపై ఒక స్పష్టతకి రాలేదట. ఈలోపే ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన పరిహారంలో కోతపై విశాల్‌ ఓ ప్రతిపాదన చేయడం.. ఈ అంశం గురించి బెటర్‌ డాట్‌ కామ్‌ బోర్డు అంతర్గత భేటీలో చర్చ జరగడం చకచకా జరిగిపోయాయి. 

చట్టపరమైన ఇబ్బందులు.. 

అయితే కొందరు ఎగ్జిక్యూటివ్స్‌ మాత్రం విశాల్‌ ప్రతిపాదనను (వారం, రెండు వారాల జీతం) వ్యతిరేకించారట. అయినా విశాల్‌ తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో.. చేసేది లేక బోర్డు సైతం ఆయన ప్రతిపాదనను అమలు చేయాలని అనుకుంది. ఈ లోపు తెర మీదకు వచ్చిన కంపెనీ లీగల్‌ అడ్వైజర్లు, అమెరికా చట్టం (WARN Act)లోని పలు సెక్షన్ల గురించి బెటర్‌ డాట్‌ కామ్‌ ముందు ఉంచారు. ఇలా భారీ స్థాయిలో లే ఆఫ్‌లు ప్రకటించిన సమయంలో.. ఉద్యోగులకు 60 రోజుల ముందస్తు నోటీసుగానీ, ఒకవేళ ఉన్నపళంగా తొలగిస్తే రెండు నెలల జీతాలుగానీ చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం విశాల్‌కి తెలిసి కూడా వారం పరిహారం నిర్ణయం వైపే మొగ్గు చూపడం విశేషం. 

దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయంతో బెటర్‌ డాట్‌ కామ్‌ బోర్డు.. విశాల్‌కు సర్దిచెప్పింది. చివరకు రెండు నెలల జీతం చెల్లింపు ప్రతిపాదనకు విశాల్‌ గార్గ్‌ను ఒప్పించింది బోర్డు. ఇక సుమారు 20 మందికి పైగా తొలగింపబడిన ఉద్యోగులు.. విశాల్‌ ఉద్యోగుల పట్ల కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆరోపణలపై స్పందించేందుకు విశాల్‌.. ఇష్టపడడం లేదు.

చదవండి: జూమ్‌ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు.. విమర్శలపై స్పందన

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top