‘మార్చి 31’ గాభరా వద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!

Key things to do before March 31 check list here - Sakshi

‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్‌ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్‌కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. 

♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, బ్యాంకులో ఫిక్సిడ్‌ డిపాజిట్, పిల్లల స్కూల్‌ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్‌’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. 

♦ ప్లానింగ్‌లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్‌పోన్‌ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్‌ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్‌ ఎక్స్‌గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి.  

♦  అలాగే క్యాపిటల్‌ గెయిన్స్‌ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోండి.  

♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్‌’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్‌ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి.


కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య ట్యాక్సేషన్‌ నిపుణులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top