9 ఏళ్ల ‘కౌటిల్య కటారియా’కు సలాం కొడుతున్న దిగ్గజ టెక్‌ కంపెనీలు!

Kautilya Katariya Became The World Youngest Computer Programmer - Sakshi

సాఫ్ట్‌వేర్‌ కొలువు అంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. ఇదిగో ఈ చిచ్చరపిడుగు అలాగే చేశాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఎదిగాడు. వరల్డ్‌ వైడ్‌ టెక్‌ దిగ్గజ కంపెనీల సీఈవోలకు టెక్నాలజీ పాటాలు నేర్పిస్తూ అందరితో  ఔరా అనిపిస్తున్నాడు. 

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ అనే పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల కౌటిల్య కటారియా టెక్నాలజీ గురించి కూడా తెలియని వయస్సుల్లో టెక్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. భారత్‌లోని టైర్-3 నగరం నుంచి యూకేలోని మెట్రోపాలిటన్ ప్రపంచానికి వెళ్లి.. 6 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన కోడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు ఈ బాల మేధావి. 9 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా టెక్, కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లలో స్పీకర్‌గా ప్రసంగాలతో దిగ్గజ సంస్థల సీఈవోల నుంచి ప్రశంసలందుకుంటున్నాడు.  

కౌటిల్య కటారియా ఎవరు?
కౌటిల్య కటారియా యూకేలోని నార్తాంప్టన్ (Northampton)లోని వూటన్ పార్క్ స్కూల్లో చదువుకున్నాడు. 10, 11, 12 తరగతుల విద్యార్థులతో కలిసి జీసీఎస్ఈ మ్యాథ్స్ పరీక్షలో అత్యధిక గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. 


 
5 సంవత్సరాల వయస్సు నుంచి 

బాల మేధావిగా మారడానికి అతని ప్రయాణం 5ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. అతని తండ్రి ఈశ్వర్ కటారియా..ఆ వయస్సులో కౌటిల్యకు కోడింగ్‌కు సంబంధించిన ఓ  పుస్తకాన్ని కొనిచ్చారు. ఆ పుస్తకమే అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒక్కరోజులో పుస్తకాన్ని పూర్తి చేసి కంప్యూటింగ్ నేర్పించడం మొదలుపెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

 

సొంతంగా సెర్చ్ ఇంజిన్, చాట్ బాట్‌ను తయారు చేసి ఐబీఎంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ పర్ట్ అక్రిడిటేషన్ పొందారు. ఐబీఎంకు చెందిన వాట్సన్ సూపర్ కంప్యూటర్‌తో స్మోక్‌, ఫైర్‌ను గుర్తించే ప్రోగ్రామ్‌ను రూపొందించాడు ఈ చిచ్చర పిడుగు. 

9 సంవత్సరాల వయస్సులో, కంప్యూటింగ్, గణితంలో పరిధిని విస్తరించడానికి విభిన్న అభిరుచులు గల యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ది డిసిఫర్ అనే వేదికను స్థాపించాడు. భవిష్యత్తులో కొత్త రకం ఏఐని అభివృద్ధి చేయాలని అతని లక్ష్యం. ప్రస్తుతం డాక్టర్ నుంచి రాకెట్ వరకు ఇలా ఏ రంగంలోనైనా పని చేసే రోబోను తయారు చేయాలనే డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యాడు. ఆల్‌ ది బెస్ట్‌ కౌటిల్య కటారియా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top