ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం

Kapil Wadhawan offers Rs 43,000 cr family assets to repay - Sakshi

ఆర్‌బీఐ అడ్మినిస్ట్రేటర్‌కు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ వాధ్వాన్‌ లేఖ

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ప్రమోటర్‌ కపిల్‌ వాధ్వాన్‌ తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన అడ్మిని స్ట్రేటర్‌ ఆర్‌ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్‌ ప్రతిపాదించారు.

2018 సెప్టెంబర్‌ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కారణంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో పాటు పలు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్‌మాల్‌ వంటి ఆరోపణలపై డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్‌ వాధ్వాన్‌ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ని వేలానికి ఉంచగా ఓక్‌ట్రీ, ఎస్‌సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top