
37.24 బిలియన్ డాలర్లు
రెండు నెలల క్షీణతకు బ్రేక్
న్యూఢిల్లీ: ఎగుమతులు రెండు వరుస నెలల క్షీణత తర్వాత జూలైలో పుంజుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 7.29% వృద్ధితో 37.24 బిలియన్ డాలర్ల విలువైన (రూ.3.24 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. దిగుమతులు సైతం 8.6% పెరిగి 64.59 బిలియన్ డాలర్ల (రూ.5.62 లక్షల కోట్లు)కు చేరాయి. దీంతో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరి, 27.35 బిలియన్ డాలర్లుగా (రూ.2.38 లక్షల కోట్లు) నమోదైంది.
గతేడాది నవంబర్ (31.77 బిలియన్ డాలర్లు) తర్వాత ఇదే గరిష్ట వాణిజ్య లోటు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3% పెరిగి 149.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 5%కి పైగా పెరిగి 244 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్య లోటు 4 నెలల్లో 94.81 బిలి యన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఎగుమతులే ఎక్కువ వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, రత్నాభరణాలు, ఫార్మా, కెమికల్స్ ఎగుమతుల్లో బలమైన పనితీరు చూపాయి.