
డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్‌ఐఎల్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 313 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు ఎగసింది.
అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 79 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు భారీగా పెరిగాయి. వడ్డీ ఆదాయం రూ. 162 కోట్ల నుంచి రెట్టింపై రూ. 363 కోట్లకు చేరింది. ఈ కాలంలో జియో పేమెంట్స్ బ్యాంక్(జేపీబీఎల్)లో 14.96 శాతం వాటాకు సమానమైన 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను ఎస్‌బీఐ నుంచి సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించింది. వెరసి 2025 జూన్ 18 నుంచి జేపీబీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా అవతరించినట్లు వెల్లడించింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం వృద్ధి
ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 322 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 294 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,736 కోట్ల నుంచి రూ. 2,984 కోట్లకు బలపడింది.
వడ్డీ ఆదాయం రూ. 2,314 కోట్ల నుంచి రూ. 2,362 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. నిర్వహణ లాభం రూ. 508 కోట్ల నుంచి రూ. 672 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.5 శాతం నుంచి 3.15 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.44 శాతం నుంచి 0.68 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 18.11 శాతం నుంచి 19.48 శాతానికి మెరుగుపడింది.