Cryptocurrency: క్రిప్టోకి అనుమతులు వచ్చేనా ? కేంద్రం వరుస సమావేశాలు!

Jayant Sinha led Parliarmentary panel to gather views from crypto exchanges - Sakshi

Crypto Finance: క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా ? క్రిప్టో కరెన్సీకి అనుమతులు జారీ చేస్తూనే చట్టబద్ద నియంత్రణ ఉండేలా ఏర్పాట్టు చేయబోతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రిప్టోపై ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. 

జయంత్‌సిన్హా నేతృత్వంలో
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ పరంగా నిర్ణయం ప్రకటించే ముందు ఇందులో భాగస్వాములగా ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిప్టో ఎక్సేంజీ ప్రతినిధులు, బ్లాక్‌ చెయిన్‌ అండ్‌ క్రిప్టో అసెట్స్‌ కౌన్సిల్‌ (బీఏసీసీ), ఇండస్ట్రీ బాడీస్‌తో పాటు ఈ లావాదేవీలతో సంబంధం ఉండే ఇతర వర్గాలతో పార్లమెంటరీ ప్యానెల్‌ సోమవారం సమావేశం కానుంది. దీనికి మాజీ ఆర్థిక మంత్రి, పార్లమెంట్‌ సభ్యుడు జయంత​ సిన్హా నేతృత్వం వహించనున్నారు. 

ఐఐఎం అహ్మదాబాద్‌ సమీక్ష
ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మరోసారి ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (అహ్మదాబాద్‌) కమిటీ సమీక్షిస్తుంది. అనంతరం క్రిప్టోకి సంబంధించిన అంశం పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. అక్కడ క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇవ్వాలా ? ఇస్తే ఎలాంటి చట్టపరమైన షరతులు విధించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

నలువైపులా ఒత్తిడి
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక్కటైన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి అనుమతులు ఇవ్వాలంటూ ప్రప్రంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు చట్టపరమైన అనుమతులు లేకపోయినా దేశంలో క్రిప్టో లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో భవిష్యత్తుపై చర్చించేందుకు ఇప్పటికే ఓ దఫా మంత్రులు, ఆర్బీలతో చర్చలు పూర్తయ్యాయి. ఆ సమావేశంలో చర్చించినట్టుగా క్రిప్టో కరెన్సీలో భాగస్వామ్య పక్షాలు, మేనేజ్‌మెంట్‌ సంస్థల అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది ప్రభుత్వం. 

ఆర్బీఐ నుంచి
క్రిప్టోకరెన్సీపై సుప్రీం కోర్టు నిషేధం కొనసాగుతోంది. అయితే మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే నేరుగా డిజిటల్‌ కరెన్సీ విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. కాగా ప్రస్తుతం క్రిప్టోపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. 

చదవండి:క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top