
క్యూ4లో రూ. 6,417 కోట్లు
షేరుకి రూ. 7.85 డివిడెండ్
ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో పన్ను, అనూహ్య పద్దుకుముందు స్టాండెలోన్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 6,417 కోట్లకు చేరింది. సిగరెట్ల ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా తోడ్పడింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 6,288 కోట్లు ఆర్జించింది. హోటళ్ల బిజినెస్ విడదీత తదుపరి ఫలితాలివి.
ఐటీసీ హోటళ్ల విడదీతతో రూ. 15,179 కోట్ల వన్‌టైమ్ లాభం అందుకుంది. పట్టణాలలో వినియోగం మందగించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల డిమాండ్ అమ్మకాలకు అండగా నిలిచినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 7.85 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. సిగరెట్ల బిజినెస్ ద్వారా 4 శాతం అధికంగా రూ. 5,118 కోట్ల అమ్మకాలు సాధించింది. కన్జూమర్ బిజినెస్ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 5,495 కోట్లను తాకింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 18,266 కోట్లను తాకింది.
పూర్తి ఏడాదికి...
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 20,092 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023–24లో లాభం రూ.19,910 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 66,657 కోట్ల నుంచి రూ. 73,465 కోట్లకు జంప్ చేసింది. ఇక హోటళ్ల బిజినెస్ తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్ 2024) రికార్డ్ నెలకొల్పుతూ రూ. 573 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించినట్లు ఐటీసీ వెల్లడించింది. అనూహ్య పద్దుతోపాటు, పన్నుకు ముందు లాభమిది. హోటళ్ల బిజినెస్‌ను 2025 జనవరిలో విడదీయడం తెలిసిందే.
ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 1.6 శాతం నష్టంతో రూ. 426 వద్ద ముగిసింది.