
మధ్య కాలానికి వ్యాపారాల విస్తరణపై వ్యయం
చైర్మన్ సంజీవ్ పురి ప్రకటన
కోల్‌కతా: ఐటీసీ మధ్య కాలానికి తన వ్యాపారాలపై రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోనున్నట్టు చైర్మన్, ఎండీ సంజీవ్ పురి ప్రకటించారు. ఏ వ్యాపారాలపై వెచ్చించేదీ స్పష్టం చేయలేదు. ఇటీవలి కాలంలో ఎనిమిది ప్రపంచస్థాయి తయారీ కేంద్రాలపై రూ.4,500 కోట్లను ఐటీసీ ఖర్చు చేసినట్టు కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులకు వెల్లడించారు.
ఎఫ్‌ఎంసీజీ, ప్యాకేజింగ్, ఎగుమతులకు సంబంధించి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులపై ఈ పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 40 అత్యాధునిక తయారీ వసతులను నిర్మించినట్టు గుర్తు చేశారు. 250 తయారీ కేంద్రాలు, 7,500 ఎంఎస్‌ఎంఈలతో కూడిన ఐటీసీ ఎకోసిస్టమ్‌ను ఇవి బలోపేతం చేస్తాయన్నారు. ‘‘కంపెనీ వ్యాపారాలన్నింటా 90 శాతం మేర అదనపు విలువ జోడింపు చర్యలను చేపట్టాం.
వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ఫుడ్ సేవల విభాగంలోకి ప్రవేశించాం. ఇప్పటికే ఐదు పట్టణాల్లో 60 క్లౌడ్ కిచెన్లను ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ ఆపరేషన్స్, ఆశీర్వాద్ సౌల్ క్రియేషన్స్, సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్, శాన్షో బ్రాండ్ల కింద ఏర్పాటు చేశాం’’అని సంజీవ్ పురి వివరించారు. మూడేళ్లలో ఈ వ్యాపారం ఏటా 108 శాతం వృద్ధిని చూసినట్టు చెప్పారు. గత మూడేళ్లలో 300 కొత్త ఉత్పత్తులను కంపెనీ విడుదల చేసినట్టు వాటాదారుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత బ్రాండ్లు ప్రపంచ వేదికపై సత్తా చాటాలన్నది తమ అభిమతమంటూ.. ఈ విషయంలో భారత్‌కే తొలి ప్రాధాన్యమని చెప్పారు.
డీమెర్జర్‌పై సరైన సమయంలో నిర్ణయాలు
ఐటీసీ ఇన్ఫోటెక్ సహా తన వ్యాపారాల డీమెర్జర్ (వేరు చేసి లిస్ట్ చేయడం) విషయమై ఎప్పటికప్పుడు అవకాశాలను ఐటీసీ మదింపు వేస్తుందని సంజీవ్ పురి తెలిపారు. పోటీ వాతావరణం, వ్యాపారం పరిపూర్ణతకు రావడం, అవకాశాలు, విలువ జోడింపు తదితర అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.