IRDAI: జీవితబీమా పాలసీల ఆవిష్కరణలకూ స్వేచ్ఛ

IRDAI: No permission required to launch new life insurance products - Sakshi

ముందస్తు అనుమతి లేకుండా విడుదల

అనుమతించిన ఐఆర్‌డీఏఐ

ఆవిష్కరణ తర్వాత దరఖాస్తు విధానం

న్యూఢిల్లీ: తన నుంచి ముందస్తు అనుమతి లేకుండా అన్ని రకాల హెల్త్, సాధారణ బీమా పాలసీల ఆవిష్కరణకు ఇటీవలే అనుమతించిన బీమా రంగ అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ.. తాజాగా జీవిత బీమా పాలసీల విషయంలోనూ ఇదే స్వేచ్ఛ కల్పించింది. జీవిత బీమా సంస్థలు తన నుంచి ముందు అనుమతి తీసుకోకుండా ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరల్లో వాటికి వెసులుబాటు లభించనుంది.

కొత్త ప్లాన్లను ముందుగా విడుదల చేసి, ఆ తర్వాత వాటి అనుమతికి బీమా సంస్థలు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఒక ఉత్పత్తిని వేగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టొచ్చు. అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. ముందు అనుమతి తీసుకోవడానికి.. ఉత్పత్తి ఆవిష్కరించిన తర్వాత అనుమతి పొందడానికి మధ్య వ్యత్యాసం ఉంది. ముందస్తు అనుమతి పొందేట్టు అయితే ఎన్నో పరిమితులు, నిబంధనల పరిధిలో ఉత్పత్తుల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ, అనుమతి తీసుకోకుండా జారీ చేసే ఉత్పత్తుల రూలకల్పన విషయంలో కంపెనీలు స్వేచ్ఛగా వ్యవహరించగలవు.

ఇప్పటి వరకు అన్ని రకాల జీవిత బీమా పాలసీలు, రైడర్లకు ముందస్తు అనుమతి అమల్లో ఉండడం గమనార్హం. భారత్‌ను మరింత బీమా రక్షణ కలిగిన దేశంగా మార్చేందుకు సంస్కరణలకు సుముఖంగా ఉన్నట్టు ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. ‘‘మారుతున్న మార్కెట్‌ ధోరణులకు తగ్గట్టు బీమా పరిశ్రమ వేగంగా స్పందించేందుకు.. ఉత్పత్తుల డిజైన్, ధరలు, వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా.. జీవిత బీమా ఉత్పత్తులకు సైతం ‘యూజ్‌ అండ్‌ ఫైల్‌ ప్రక్రియ’ను విస్తరించాలని నిర్ణయించాం’’అని ఐఆర్‌డీఏఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనివల్ల బీమా సంస్థలు మార్కెట్‌ అవసరాలకు వీలుగా వేగంగా ఉత్పత్తులను విడుదల చేయగలవని పేర్కొంది.  

సానుకూలం
ఐఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు సానుకూలమని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఎండీ, సీఈవో ఆశిష్‌ కే శ్రీవాస్తవ తెలిపారు. మరింత ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని, ప్రజలు తమ భవిష్యత్తుకు సంబంధించి ప్లాన్ల ఎంపికలకు ఆప్షన్లను విస్తృతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా సానుకూల నిర్ణయమని, ఉత్పత్తులకు అనుమతుల ప్రక్రియల సులభంగా మారినట్టు ఇన్సూరెన్స్‌బ్రోకర్‌ ‘సెక్యూర్‌ నౌ’ సహ వ్యవస్థాపకుడు కపిల్‌ మెహతా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top