ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు.. 

Irdai asks insurance companies to lay down social media guidelines for employees - Sakshi

సోషల్‌ మీడియా వినియోగానికి సంబంధించి ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను రూపొందించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కోరింది. ఒక సంస్థ ప్రతిష్ట దాని ఉద్యోగుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, సంస్థ ప్రతిష్టను పెంచేలా, విలువను జోడించే విధంగా ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించాలని పేర్కొంది.

ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్‌లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!

ఐఆర్‌డీఏఐ సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు 
ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాల్లో సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. దాని ప్రకారం.. ఇన్సూరెన్స్‌ సంస్థలకు సంబంధించి ధ్రువీకరించని, గోప్యమైన సమాచారాన్ని ఉద్యోగులు తమ బ్లాగ్‌లు, చాట్‌ ఫోరమ్‌లు, డిస్కషన్ ఫోరమ్‌లు, మెసెంజర్ సైట్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్‌ చేయకూడదు. 

ఏ ఉద్యోగికైనా సంస్థకు సంబంధించిన సమాచారం మెయిల్, మీడియా ఫోరమ్‌లలో లేదా ఇతర మార్గాల ద్వారా వస్తే దాన్ని ఏదైనా మీడియా ఫోరమ్‌లో పోస్ట్‌ చేయాలనుకున్నప్పుడు సంస్థ సమ్మతి కచ్చితంగా తీసుకోవాలి. సంస్థ సేవా లోపాన్ని నివేదించడానికి లేదా ఫిర్యాదు చేయడానికి మీడియా ఫోరమ్‌లను ఉపయోగించకూడదు. ఏదైనా సమాచారం వ్యక్తిగతంగా పోస్ట్‌ చేస్తున్నప్పుడు అది పూర్తిగా తన వ్యక్తిగతమైనదని,  సంస్థకు ఎలాంటి సంబంధం లేదనే సూచనను తప్పకుండా ఉంచాలి. వ్యక్తిగత వెబ్‌సైట్‌లు లేదా సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సంస్థ లేదా దాని వ్యాపారంపై ఎలాంటి విమర్శలు లేదా వ్యాఖ్యానాలు చేయకూడదు.

విదేశీ రీ-ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు (FRB)తో సహా ఐఆర్‌డీఏఐ పరిధిలోని అన్ని బీమా సంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. బీమా సంస్థల కోసం 2017లో ఈ ఇన్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను ఐఆర్‌డీఏఐ జారీ చేసింది. తర్వాత 2022లో తమ పరిధిలోని అన్ని సంస్థలకూ విస్తరించింది. విస్తృతంగా పెరిగిన డిజిటల్ సాంకేతికత, సైబర్ భద్రతా సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటూ సైబర్ దాడుల నుంచి బీమా పరిశ్రమ రక్షణ, సంబంధిత పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలను సవరించింది.

ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్‌! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top