రియల్టీలో టెక్నాలజీకి డిమాండ్‌

Investments in proptech firms expected to touch 1bn dollers in 2025 - Sakshi

ప్రాపర్టీ టెక్‌ సంస్థల్లో పెట్టుబడులకు ఆసక్తి

2025 నాటికి బిలియన్‌ డాలర్లు

2020తో పోలిస్తే రెట్టింపు

సీఐఐ, కొలియర్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రాప్‌టెక్‌) సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇది ప్రాప్‌టెక్‌ సంస్థలకు అవకాశాలను విస్తృతం చేయనుంది. ఈ దృష్యా  పెట్టుబడులకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. 2025 నాటికి ఈ కంపెనీల్లో వార్షిక పెట్టుబడులు బిలియన్‌ డాలర్లకు (రూ.7,700 కోట్లు) చేరుకోవచ్చని సీఐఐ, కొలియర్స్‌ సంస్థలు అంచనా వేశాయి.

2020లో ప్రాప్‌ టెక్నాలజీ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు 551 మిలియన్‌ డాలర్లు(రూ.4,242 కోట్లు)గా ఉన్నాయి. సీఐఐ, కొలియర్స సంయుక్తంగా ‘రియల్‌ ఎస్టేట్‌ 3.0: టెక్నాలజీ లెడ్‌ గ్రోత్‌’ పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. కరోనా మహమ్మారి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు దారితీసినట్టు తెలిపింది. ఈ టెక్నాలజీ సాయంతోనే ఉన్న చోట నుంచే రిమోట్‌గా పనిచేసేందుకు వీలు పడిందని పేర్కొంది.  

టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు..
‘‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను కరోనాకు పూర్వం వినియోగించారు. అయితే ఈ తరహా టెక్నాలజీల వినియోగం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టితో స్మార్ట్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్, వాయు నాణ్యతను ఆటోమేటెడ్‌గా ఉంచే సిస్టమ్స్‌ వినియోగం పెరిగినట్టు తెలిపింది. ఏఐ, వీఆర్, ఐవోటీ, బ్లాక్‌ చైన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ మరింత సమర్థవంతగా మారుతుందని పేర్కొంది. భారత రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని టెక్నాలజీ మరింత పారదర్శకంగా మారుస్తుందని అంచనా వేసింది.

ఆవిష్కరణలు ఘనం..  
ప్రాపర్టీ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. ప్రణాళిక దగ్గర్నుంచి, డిజైన్, నిర్మాణంగ టెక్నిక్‌లు, వసతుల నిర్వహణ, పాపర్టీ నిర్వహణ వరకు అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినట్టు తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ప్రాప్‌టెక్‌ బాగా వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. కాకపోతే గోప్యత, డేటా భద్రత, కొనుగోలుదారులు, నిర్మాణదారులపై పడే వ్యయాలు, విద్యుత్‌ సరఫరాపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో టెక్నాలజీల అమలుకు ఉన్న సవాళ్లుగా పేర్కొంది.

‘‘మాన్యువల్‌గా కార్మికులకు డిమాండ్‌ తగ్గడంతో కొందరికి ఉపాధి నష్టం కలగొచ్చు. అదే సమయంలో ప్రత్యేకమైన కార్మికులకు డిమాండ్‌ పెరుగుతుంది’’అని తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌లో టెక్నాలజీ వినియోగం వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఆస్తి విలువ పెరుగుతుందని రెలోయ్‌ వ్యవస్థాపకుడు అఖిల్‌ సరాఫ్‌ అన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top