
దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్ రియల్టీ, లోధా డెవలపర్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒబెరాయ్ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.
బీఎస్‌ఈ బల్క్‌డీల్ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్‌కల్లా ఇన్వెస్కో ఫండ్‌కు ఒబెరాయ్ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్‌లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది.
ఎస్‌బీఐ ఫండ్ కొనుగోలు
ఒబెరాయ్ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్‌ఎస్ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు.