లక్ష కోట్ల డాలర్లకు ఇంటర్నెట్‌ ఎకానమీ

Internet Economy for Lakh Crore Dollars - Sakshi

2030 నాటికి ఆరింతలుపెరుగుతుందని అంచనా 

ఈ–కామర్స్‌ విభాగం దన్ను 

గూగుల్, టెమాసెక్,బెయిన్‌ సంయుక్త నివేదిక 

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ విభాగం దన్నుతో దేశీ ఇంటర్నెట్‌ ఎకానమీ 2030 నాటికి ఆరింతలు పెరగనుంది. 1 లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. గూగుల్, టెమాసెక్, బెయిన్‌ అండ్‌ కంపెనీ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో భారత ఇంటర్నెట్‌ ఎకానమీ 155–175 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది.

బీ2సీ ఈ–కామర్స్‌ విభాగం, బీ2బీ ఈ–కామర్స్, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్విస్‌ ప్రొవైడర్లు, ఓవర్‌ ది టాప్‌ సంస్థల (ఓటీటీ) వంటి ఆన్‌లైన్‌ మీడియా దేశీ ఇంటర్నెట్‌ ఎకానమీకి వృద్ధి కారకాలుగా ఉండగలవని గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో చాలా మటుకు కొనుగోళ్లు డిజిటల్‌గానే జరగనున్నాయని పేర్కొన్నారు.

డిజిటల్‌ ఆవిష్కరణలకు అంకుర సంస్థలు బాటలు వేయగా, కోవిడ్‌ మహమ్మారి అనంతరం చిన్న–మధ్య–భారీ తరహా సంస్థలు మార్కెట్లో దీటుగా పోటీపడేందుకు డిజిటల్‌ సాంకేతికతలను గణనీయంగా ఉపయోగించడం ఆరంభించాయన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధికి  భారత్‌ కొత్త ఆశాదీపంగా మారిందని టెమాసెక్‌ ఎండీ (ఇన్వెస్ట్‌మెంట్స్‌) విశేష్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు. డిజిటల్‌ సాంకేతికతలను ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించే ఆర్థిక వ్యవస్థను ఇంటర్నెట్‌ ఎకానమీగా పరిగణిస్తారు.  

నివేదిక ప్రకారం..  
బీ2సీ ఈ–కామర్స్‌ 2022లో 60–65 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 5–6 రెట్లు పెరిగి 350–380 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.  
బీ2బీ ఈ–కామర్స్‌ 8–9 బిలియన్‌ డాలర్ల నుంచి 13–14 రెట్లు పెరిగి 105–120 బిలియన్‌ డాలర్లకు ఎగియనుంది.  
సాఫ్ట్‌వేర్‌–యాజ్‌–ఎ–సర్వీస్‌ విభాగం 5–6 రెట్లు వృద్ధి చెంది 12–13 బిలియన్‌ డాలర్ల నుంచి 65–75 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top