ఇండిగో- హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ .. హైజంప్‌

Interglobe aviation- Hindustan Aeronatics share jumps - Sakshi

విమానాల విక్రయం, లీజు వార్తలు..

10 శాతం దూసుకెళ్లిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్

రక్షణ శాఖ నుంచి కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

8 శాతం జంప్‌చేసిన హెచ్‌ఏఎల్‌- ఏడాది గరిష్టానికి షేరు

ఏటీఆర్‌ విభాగంలోని 12 ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకివ్వడం, విక్రయించడం వంటి ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. మరోపక్క దేశీయంగా తయారు చేసిన రూ. 8,722 కోట్ల విలువైన పరికరాల కొనుగోలుకి రక్షణ శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడికావడంతో పీఎస్‌యూ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌(హెచ్‌ఏఎల్‌) కౌంటర్‌కు సైతం డిమాండ్‌ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇంటర్‌గ్లోబ్‌
ఇండిగో బ్రాండుతో విమానయాన సేవలందించే  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 13 ఏటీఆర్‌ విమానాలను లీజుకివ్వడం, విక్రయించడం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే ఎయిర్‌గో క్యాపిటల్‌, డీఏఈ తదితర లెస్సర్స్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో 2 కోట్ల డాలర్ల(రూ. 150 కోట్లు) వరకూ సమకూరే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఇటీవలే అనుమతించింది. మరోవైపు విమానాల లీజు చెల్లింపులపై మారటోరియం ద్వారా లబ్ది పొందే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. 

హెచ్‌ఏఎల్‌
మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ రూ. 8,722 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసేందుకు తాజాగా అనుమతించింది. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ అభివృద్ధి చేసిన ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్‌ఏఎల్‌ డిజైన్‌ చేసి రూపొందించిన 106 బేసిక్‌ ట్రయినర్‌ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో హెచ్‌ఏఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1098 వద్ద ట్రేడివుతోంది. తొలుత ఒక దశలో రూ. 1127 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని అందుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top