
హెచ్‌ఏఎల్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రశంసలు
నాసిక్: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశంలో వివిధ వైమానిక స్థావరాల్లో ఉన్న యుద్ధ విమానాలకు అవసరమైన తోడ్పాటును నిర్విరామంగా అందించిందని ప్రశంసించారు. ఫలితంగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ల సమర్థవంతమైన నిర్వహణ, సన్నద్ధత సాధ్యమైందన్నారు. నాసిక్‌లోని హెచ్‌ఏఎల్ కేంద్రంలో మంత్రి రాజ్‌నాథ్ శుక్రవారం తేజస్ తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ)ఎంకే1ఏ తయారీ విభాగాన్ని, శిక్షణ విమానం హెచ్‌టీటీ–40 ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
నాసిక్ విభాగంలో తయారైన తేజస్ ఎల్‌సీఏ ఎంకే1ఏ మొట్టమొదటిసారిగా రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సుఖోయ్–30 ఎంకేఐ జెట్ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణుల అనుసంధానంలో హెచ్‌ఏఎల్ నాసిక్ విభాగం కృషి మరువలేమన్నారు. తేజస్ ఎంకే1ఏ తయారీ కేంద్రంలో ఇకపై ఏటా కనీసం 24 ఎల్‌సీఏలు తయారవుతాయని వివరించారు. మిగ్–21, మిగ్–27 వంటి ఫైటర్ జెట్ల నుంచి సుఖోయ్–30 ఎంకేల వరకు తయారు చేస్తూ నాసిక్ కేంద్రం ఉత్పత్తి హబ్‌గా మారిందని చెప్పారు.