
న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం.
భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.

జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది..