
యూపీఐ సర్వీసులు ప్రారంభించిన ఎన్‌పీసీఐ
న్యూఢిల్లీ: భారత్‌లో రూపొందిన క్యూఆర్ ఆధారిత చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోకి కూడా విస్తరిస్తోంది. తాజాగా ఖతార్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఖతార్ నేషనల్ బ్యాంకుతో (క్యూఎన్‌బీ) ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో యూపీఐ అందుబాటులోకి వచ్చిన ఎనిమిదో దేశంగా ఖతార్ నిల్చింది.
ఇప్పటిదాకా భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. దీనితో ఆయా దేశాలను సందర్శించే భారతీయులు విదేశీ కరెన్సీ కోసం చూసుకోవాల్సిన అవసరం లేకుండా తక్షణం రూపాయి మారకంలోనే చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది.
డిజిటల్ చెల్లింపులను సులభతరంగా చేసిన యూపీఐ లావాదేవీలు దేశీయంగా కొత్త రికార్డులను తాకుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువ చేసే 2,000 కోట్ల లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. రెండేళ్లలోనే రోజువారీ లావాదేవీల పరిమాణం రెట్టింపయ్యింది. ఏడాది వ్యవధిలోగా రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.