వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మధ్య చాలామంది ఇబ్బందిపడుతున్న వేళ.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారత సంతతి వ్యాపారవేత్త హార్దిక్ జగ్డా రోజువారీ జీవనశైలి ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రాక్సిమిటీ వర్క్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన హార్దిక్ జగ్డా.. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తారు. వారంలో ఆరు రోజులు పనిచేసే ఆయన.. ఉదయం లేవగానే ఫోన్ చూడటం, ఈమెయిల్స్ చెక్ చేయడం వంటివి చేయరు. ఆ సమయాన్ని వ్యాయామం, కంపెనీ అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం కేటాయిస్తారు. ఉదయం 7 గంటలు దాటితే తన సమయం తన చేతుల్లో ఉండదని ఆయన చెబుతున్నారు.
హార్దిక్ ఈ అలవాటును ఎందుకు మొదలుపెట్టారంటే.. వ్యాపారవేత్తలు, క్రీడాకారుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. చాలామంది అథ్లెట్లు ఉదయాన్నే శిక్షణ తీసుకుంటూ, మిగతా సమయంలో విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో తాను కూడా అదే పద్ధతిని అనుసరించడం ప్రారంభించారు.
ఈ కారణంగానే.. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు. ఇలా మిగతా పనులు మొదలయ్యేలోపే కంపెనీ కోసం నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నారు. ఈ అలవాటు వ్యాపారంలోనూ తనకు ఉపయోగపడిందని హార్దిక్ తెలిపారు.
రెండేళ్ల క్రితం ఒక కొత్త ప్రాజెక్టు కోసం తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించాల్సి వచ్చింది. అప్పుడు తన బృందంతో కలిసి రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పులు చేశారు. దీంతో నియామక ప్రక్రియను 72 గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించగలిగారు. ఉదయం ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం ఉండటం వల్లే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారాల్లో కూడా పబ్లిక్ స్పీకింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు.
అయితే.. తాను ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగులందరూ అలాగే పనిచేయాలని హార్దిక్ కోరుకోవడం లేదు. ముఖ్యంగా 996 వర్క్ కల్చర్‌ను ఆయన వ్యతిరేకిస్తారు. ఈ విధానంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులు పనిచేయాలి. అంటే వారానికి 72 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
తన కంపెనీలో మాత్రం ఉద్యోగులు తమకు అనుకూలమైన సమయంలో పనిచేసుకోవచ్చని, రాత్రిపూట ఎక్కువ ఉత్పాదకతతో పనిచేసేవారికీ అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే, టీమ్‌లోని ఇతర సభ్యులతో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు సమన్వయం ఉండాలని సూచిస్తున్నారు.


