ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2026–27) రెండో త్రైమాసికంలో రూ. 5,781 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 4,425 కోట్లతో పోలిస్తే 31 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడడం ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం 30.32 శాతం వృద్ధితో రూ. 5,537.20 కోట్లకు చేరింది.
గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ .4,249.98 కోట్లుగా ఉంది. కీలకమైన నికరవడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 20.09 శాతం పెరిగి రూ.10,583 కోట్లకు చేరింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.43 శాతం పెరుగుదల. వడ్డీయేతర ఆదాయం 6.90 శాతం తగ్గి రూ.4,651 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా ట్రెజరీ ఆదాయం గణనీయంగా తగ్గడం కారణమైంది.
ట్రెజరీ ఆదాయం 34.60 శాతం క్షీణించి రూ.701 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,073 కోట్లుగా ఉంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్‌ఏ) డిపాజిట్ల వాటా పెరిగింది. దేశీయ రుణాల పంపిణీ 17.35 శాతం పెరిగి రూ.11.06 లక్షల కోట్లకు చేరింది. రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కలిపి మొత్తంగా ఇచ్చిన రుణాలు 14.65 శాతం పెరిగి రూ.6.36 లక్షల కోట్లకు చేరాయి.
ఇదీ చదవండి: 109 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు ఇచ్చిన డబ్బు.. ఇప్పటికీ తేలని లెక్క!


