న్యూఢిల్లీ: భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రముఖ బీమా సంస్థల సీఈఓలు తమ పదవులకు రాజీనామా చేసి సొంత వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో సాధారణ బీమా (జనరల్ ఇన్సూరెన్స్) రంగంలో వృద్ధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. బీమా రంగంలో అపార అనుభవం కలిగిన సీఈఓలకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి గణనీయమైన నిధుల మద్దతు లభిస్తోంది.
ఐఆర్‌డీఏఐ సంస్కరణలు.. డిజిటల్ జోరు
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన పలు సంస్కరణలతో వ్యాపార నిర్వహణ సులభతరమైంది. దీంతో బీమా రంగం ‘ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ’గా మారింది. కొత్త సంస్థల ప్రవేశాన్ని కూడా నియంత్రణ సంస్థ సానుకూలంగా స్వాగతిస్తోంది. మరోవైపు ‘బీమా సుగమ్’ వంటి డిజిటల్ పంపిణీ మౌలిక సదుపాయాలు, యూపీఐ తరహా కస్టమర్ యాక్సెస్ విధానాలు బీమా రంగ వ్యాపార నమూనాలను మౌలికంగా మార్చుతున్నాయి.
బీమా రంగంలో అపార అవకాశాలు
ఆసియా ఆర్థిక సేవల రంగంలో భారత జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాల్లో ఒకటిగా నిలుస్తోందని అపియరీ కన్సల్టింగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ హరిహరన్ రామకృష్ణన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ బీమా వ్యాప్తి జీడీపీలో సగటున నాలుగు శాతానికి పైగా ఉండగా, భారత్‌లో అది కేవలం ఒక శాతానికే పరిమితమైందన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘కేవలం పెట్టుబడులతోనే ఈ మార్కెట్‌లోని అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు గుర్తించాయి. ఈ అవకాశాలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచడానికి అనుభవజ్ఞులైన రంగ నిపుణులు అవసరం. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఈఓలు నియంత్రణ సంస్థలతో సంబంధాలు, పంపిణీ వ్యవస్థపై నమ్మకం, రిస్క్ అంచనా సామర్థ్యం వంటి కీలక బలాలను వెంట తెచ్చుకుంటారు. కొత్త సంస్థలు ఇదే స్థాయి విశ్వసనీయతను, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది’’ అని రామకృష్ణన్ తెలిపారు.
స్టార్ హెల్త్ ఒక ఆదర్శం
‘‘యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీఎండీగా పదవీ విరమణ చేసిన అనంతరం వెంకటసామి జగన్నాథన్ చెన్నైలో చిన్న కార్యాలయం నుంచి ప్రారంభించిన స్టార్ హెల్త్‌ను రూ.30,000 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. విషయ పరిజ్ఞానం, వ్యాపార దృక్పథం, ఓపికతో కూడిన పెట్టుబడులు కలిస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేందుకు స్టార్ హెల్త్ ఉదంతం నిరూపించింది’’ అని అని రామకృష్ణన్ పేర్కొన్నారు.
రాజీనామాలు.. కొత్త సంస్థల ఏర్పాటు
బీమా రంగంలో విశేష అనుభవం ఉన్న పలువురు మాజీ సీఈఓలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల మద్దతుతో కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
నీలేష్ గార్గ్ (కివి జనరల్ ఇన్సూరెన్స్)
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ మాజీ ఎండీ, సీఈఓ నీలేశ్ గార్గ్ అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్‌తో కలిసి ‘కివీ జనరల్ ఇన్సూరెన్స్’ను స్థాపించారు. ఈ సంస్థలో వెస్ట్‌బ్రిడ్జ్ 70 శాతం, గార్గ్ 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ మార్చి 2026లో ఈ సంస్థకు రిజి్రస్టేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది.
అనుజ్ త్యాగి (హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో)
కివీ జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతి లభించిన మూడు నెలలకే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనుజ్ త్యాగి తన వ్యాపార లక్ష్యాలను కొనసాగించేందుకు పదవికి రాజీనామా చేశారు.
అనూప్ రావు (జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్)
ఇదే ఏడాది మార్చిలో జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనూప్ రావు తన ఏడేళ్ల పదవీకాలం అనంతరం వైదొలిగారు. ఆయన కొత్త బీమా సంస్థలో షేర్‌హోల్డర్ లేదా ఫౌండేషన్ భాగస్వామిగా చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే నెలల్లో మరో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ కూడా వైదొలిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


