
ఎగుమతులపై వాణిజ్య అనిశ్చితుల ప్రభావం
నిదానించిన రుణాలు, పెట్టుబడులు
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ పనితీరు స్థిరంగానే కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో దేశీ సరఫరా, డిమాండ్ బలంగా ఉన్నట్టు కార్యకలాపాలను పరిశీలిస్తే తెలుస్తున్నట్టు తన నెలవారీ సమీక్షలో పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్యం పరిధిలోనే ఉండడం, రుతుపవనాల పురోగతి మెరుగ్గా ఉండడంతో దేశీ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలోకి (జూలై–సెప్టెంబర్) బలంగా అడుగుపెట్టినట్టు తెలిపింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగకపోయినా.. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూఎస్‌లో మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ తన నివేదికలో అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితి అదే పనిగా కొనసాగుతుండడం రానున్న త్రైమాసికాల్లో భారత వాణిజ్య పనితీరును ప్రభావితం చేయొచ్చని తెలిపింది.
ప్రైవేటు పెట్టుబడులు, రుణాల్లో వృద్ధి నిదానించడం ఆర్థిక పనితీరు మరింత వేగం పుంజుకోకుండా నియంత్రించొచ్చని అభిప్రాయపడింది. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక పనితీరును గమనించినట్టయితే మరింత పటిష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ అనుకున్నట్టు సజావుగానే సాగుతోందని అభివరి్ణంచింది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.
నిదానించిన రుణ వితరణ
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగానే ఉన్నప్పటికీ రుణ వృద్ధి నిదానించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రుణ గ్రహీతలు ఆచితూచి వ్యవహరించడం లేదంటే రుణ దాతలు రిస్‌్కకు సిద్ధపడకపోవడం కారణమై ఉండొచ్చని పేర్కొంది. తక్కువ వ్యయాల కారణంగా కార్పొరేట్లు బాండ్ల మార్కెట్‌లో నిధులు సమీకరణకు మొగ్గు చూపిస్తుండడం కూడా రుణ వృద్ధి నిదానించడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది. ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మద్దతుతో కొర్పొరేట్ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావాల్సి ఉందని సూచించింది.