మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే

Indian Automobile Sector Suv Vehicle Record Sales - Sakshi

ఇప్పటికే 42 శాతం వాటా కైవసం 

హ్యాచ్‌బ్యాక్‌ ధరలోనే ఇవి లభ్యం 

బీవైడీ ఇండియా ఎస్‌వీపీ సంజయ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్‌ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. 

ధర ప్రాధాన్యత కాదు..  
ప్యాసింజర్‌ వెహికల్స్‌ విషయంలో హైదరాబాద్‌ విభిన్న మార్కెట్‌. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్‌ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్‌ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి.  

ఈ ఏడాది 50,000 యూనిట్లు.. 
దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్‌ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్‌ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్‌ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో టాప్‌–1 ర్యాంక్‌ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్‌ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top