స్మార్ట్‌ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి

Published Sat, Dec 3 2022 6:40 AM

India Smart TV Shipments Up 38percent sales up - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) స్మార్ట్‌ టీవీల షిప్‌మెంట్‌లు (విక్రయాలు/రవాణా) 38 శాతం పెరిగాయి. పండుగల సీజన్‌ కావడం, కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్కౌంట్‌ ఆఫర్లు ఈ వృద్ధికి కలిసొచ్చినట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్‌ టీవీల వాటా 40 శాతంగా ఉంటే, చైనా బ్రాండ్ల వాటా 38 శాతంగా ఉంది. ఇక స్థానిక బ్రాండ్ల స్మార్ట్‌ టీవీల వాటా రెట్టింపై 22 శాతానికి చేరుకుంది. మొత్తం షిప్‌మెంట్లలో 32 నుంచి 42 అంగుళాల స్క్రీన్‌ టీవీల వాటా సగం మేర ఉంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లేలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఓఎల్‌ఈడీ, క్యూఎల్‌ఈడీ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్లు సైతం క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు క్యూఎల్‌ఈడీ స్క్రీన్లతో విడుదలకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్క్రీన్‌ తర్వాత కస్టమర్లు ఆడియోకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డాల్బీ ఆడియో ఫీచర్‌తో విడుదల చేస్తున్నాయి. స్మార్ట్‌ టీవీల విక్రయాలు మొత్తం టీవీల్లో 93 శాతానికి చేరాయి. రూ.20వేల లోపు బడ్జెట్‌లో టీవీల విడుదలతో ఈ వాటా మరింత పెరుగుతుందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆన్‌లైన్‌ చానళ్ల ద్వారా విక్రయాలు 35 శాతం పెరిగాయి. అన్ని ఈ కామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌లో ఆఫర్లను ఇవ్వడం ఇందుకు దోహదం చేసినట్టు ఈ నివేదిక ప్రస్తావించింది.

మొదటి స్థానంలో షావోమీ  
షావోమీ స్మార్ట్‌ టీవీ మార్కెట్లో 11 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్‌ సంగ్‌ 10 శాతం, ఎల్‌జీ 9 శాతం వాటా­తో ఉన్నాయి. వన్‌ ప్లస్‌ వార్షికంగా చూస్తే 89 శాతం వృద్ధితో తన మార్కెట్‌ వాటాను 8.5 శాతానికి పెంచుకుంది. దేశీ బ్రాండ్‌ వూ వాటా సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రెట్టింపైంది. ఎంతో పోటీ ఉన్న స్మార్ట్‌ టీవీ మార్కెట్లోకి మరిన్ని భారత బ్రాండ్లు ప్రవేశిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వన్‌ ప్లస్, వూ, టీసీఎల్‌ బ్రాండ్లు స్మార్ట్‌ టీవీ మార్కె ట్లో వేగవంతమైన వృద్ధిని చూపించాయి. 

Advertisement
Advertisement