నవంబర్‌లో సేవలకు పటిష్ట డిమాండ్‌

India Services Sector Output Growth Hits 3 Month High In Nov On Strong Demand - Sakshi

ఎస్‌అండ్‌పీ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 56.4కు అప్‌

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఇది 55.1 వద్ద ఉంది.  పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది.

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్‌లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్‌ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్‌లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి.  

సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! 
ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ అక్టోబర్‌లో 55.5గా ఉంటే, నవంబర్‌లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క  తయారీ రంగానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) చూస్తే,  నవంబర్‌లో 55.7గా నమోదయ్యింది.

అక్టోబర్‌లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top