
నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ నివేదిక
న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్‌జెన్ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది.
డిఫెన్స్‌లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.
ఎల్రక్టానిక్ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్‌జెన్ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్‌దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.