
జూన్‌లో 7.1 శాతం
దేశవ్యాప్తంగా 5.6 శాతం
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడి
జూన్‌లో నిరుద్యోగిత (నిరుద్యోగం రేటు) ఫ్లాట్‌గా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో మాదిరే జూన్‌లోనూ 5.6 శాతం వద్దే (అన్ని వయసుల వారికి సంబంధించి) కొనసాగింది. ఏప్రిల్‌లో ఉన్న 5.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ, పట్టణాల్లో నిరుద్యోగ రేటు వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. జూన్‌లో 7.1 శాతంగా నమోదైంది. ఈ మేరకు పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. పనిచేయగల అర్హతలు ఉండీ, పనిదొరక్క ఖాళీగా ఉన్న వారి గురించి ఈ గణాంకాలు తెలియజేస్తాయి.
ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులు
పట్టణాల్లో అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. మేలో 6.9 శాతం, ఏప్రిల్‌లో 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం.
పట్టణాల్లో 15.29 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు జూన్‌లో 18.8 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 17.9 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లోనూ 17.2 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు జూన్‌లో 5.6 శాతానికి తగ్గింది. మేలో ఇది 5.8 శాతంగా ఉంది.
15–29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగిత మే నెలలో 15 శాతంగా ఉంటే, జూన్‌లో 15.3 శాతానికి పెరిగింది.
కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (15 ఏళ్లకు మించిన వారిలో) మే నెలలో ఉన్న 54.8 శాతం నుంచి జూన్‌లో 54.2 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.4 శాతం చొప్పున జూన్‌లో నమోదైంది.
పురుష కార్మికుల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 78.1 శాతం, పట్టణాల్లో 75 శాతం చొప్పున ఉంది. మే నెలతో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో 35.2 శాతానికి తగ్గింది.
గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిరుద్యోగ రేటు పెరగడానికి.. సొంత పనులపై ఆధారపడడం వల్లేనని ఈ సర్వే నివేదిక తెలిపింది.