Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు

Income tax return filing deadline extended by 2 months - Sakshi

2020–21 రిటర్నులు సెప్టెంబర్‌ 30 వరకు

రెండు నెలల అదనపు సమయం ప్రకటించిన సీబీడీటీ

న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020 –21) సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. అదే విధంగా కంపెనీలకు సైతం అదనంగా ఒక నెల గడువు ఇస్తూ నవంబర్‌ 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. వ్యక్తులు (ఖాతా లకు ఆడిటింగ్‌ అవసరం లేని వారు) తమ రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఖాతాలకు ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్‌ 31. ఇవి సాధారణ గడువులు. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అదనపు సమయాన్ని ఆదాయపన్ను శాఖ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. గడువు పొడిగిం చడం వల్ల నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కినట్టేనని నాంజియా అండ్‌ కో పార్ట్‌నర్‌ శైలేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.  

► సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్‌ 16 మంజూరుకు సైతం గడువును జూలై 15కు సీబీడీటీ పొడిగించింది.  

► ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ దాఖలుకు అక్టోబర్‌ 31 వరకు, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ సర్టిఫికెట్‌ దాఖలుకు నవంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది.  

► ఆలస్యపు, సవరించిన రిటర్నుల దాఖలుకు నూతన గడువు 2022 జనవరి 31.

► ఆర్థిక సంస్థలు ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్‌ఎఫ్‌టీ) సమర్పించేందుకు మే 31వరకు ఉన్న గడువు జూన్‌ 30కు పెరిగింది.
 
► 2020–21 ఏడాదికి సంబంధించి నూతన పన్ను విధానాన్ని (తక్కువ రేట్లతో, పెద్దగా మినహాయింపుల్లేని) ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు ఐటీ రిట ర్నుల పత్రాల్లో సీబీడీటీ మార్పులు కూడా చేసింది.  

7 నుంచి ఆదాయపన్ను కొత్త పోర్టల్‌  
పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకమైన నూతన పోర్టల్‌ను జూన్‌ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది.  www. incometaxindiaefiling.gov.in  ప్రస్తుత ఈ పోర్టల్‌ స్థానంలో జూన్‌ 7 నుంచి www. incometaxgov.in పోర్టల్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఏవైనా సమర్పించాల్సినవి ఉంటే, అప్‌లోడ్, డౌన్‌లోడ్‌ పనులను జూన్‌ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్‌ 1–6 మధ్య ప్రస్తుత పోర్టల్‌ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని పేర్కొంది.  

వేగంతోపాటు కొత్త సదుపాయాలు
కొత్త పోర్టల్‌ ఎన్నో సదుపాయాలతో ఉంటుందని, వేగంగా రిటర్నుల దాఖలు, పన్ను రిఫండ్‌లకు అనుకూలంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అన్ని రకాల స్పందనలు, అప్‌లోడ్‌లు, అపరిష్కృత అంశాలన్నీ ఒకే డాష్‌బోర్డులో దర్శనమిస్తాయని వివరించింది. వెబ్‌సైట్‌లో ఉండే అన్ని ముఖ్య సదుపాయాలు మొబైల్‌ యాప్‌పైనా లభిస్తాయని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top