నగల దుకాణంలో కట్టల ​కొద్దీ.. కోట్లాది నగదు! | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో కట్టల ​కొద్దీ.. కోట్లాది నగదు!

Published Sun, May 26 2024 5:14 PM

Income Tax department raids Nashik-based jewellers, seizes Rs 116 cr in cash and assets

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అప్రకటిత లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారి సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది.  ఇటీవల నాందేడ్ లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తరువాత తాజాగా నాసిక్‌లో ఈ దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ చర్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా ఆ తర్వాత బయటకు వచ్చిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

 

Advertisement
 
Advertisement
 
Advertisement