చిత్రా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు

Income Tax raids on former NSE MD Chitra Ramkrishna - Sakshi

ఆనంద్‌ సుబ్రమణియన్‌ నివాసంలో కూడా

పన్ను ఎగవేత ఆరోపణల కోణం

న్యూఢిల్లీ/ముంబై: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ, గ్రూప్‌ మాజీ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌కి చెందిన ముంబై, చెన్నై నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబై విచారణ విభాగం ఇందులో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. ఎక్సే్చంజీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం ద్వారా వీరిద్దరూ అక్రమంగా లబ్ధి పొంది ఉంటా రన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరిపై ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత ఆరోపణలను నిర్ధా రించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించేందుకు నిర్వహించిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదీ నేపథ్యం..: 2013 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబర్‌ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే నిబంధనలను పక్కన పెట్టి, ఎవరో అజ్ఞాత, అదృశ్య హిమాలయ యోగి సూచనల మేరకు ఆనంద్‌ సుబ్రమణియన్‌ను జీవోవోగా, ఆ తర్వాత ఎండీకి సలహాదారుగా నియమించారంటూ చిత్రపై ఆరోపణలు ఉన్నాయి. పైపెచ్చు ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక సమాచారమంతటినీ సదరు యోగికి చేరవేయడంతో పాటు ఉద్యోగుల పనితీరు మదింపులోనూ ఆయన సలహాలు తీసుకుని, వాటిని అమ లు చేశారని సెబీ తన విచారణలో నిర్ధారించింది. ఇంత జరిగినా ఆ యోగి వివరాలను వెల్లడించని చిత్రా రామకృష్ణ.. ఆ అజ్ఞాత వ్యక్తి నిరాకారులని, తనకు ఆధ్యాత్మిక శక్తిలాంటి వారని మాత్రమే విచారణలో చెప్పారు. దీంతో, ఈ మొత్తం వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పాలనా లోపాలు జరిగాయంటూ ఆమెతో పాటు మరికొందరు అధికారులను సెబీ ఆక్షేపించింది. చిత్రాకు రూ.3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ, సుబ్రమణియన్, ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ రవి నారాయణ్‌పై తలో రూ.2 కోట్ల జరిమానా వి ధించింది. దీంతోపాటు పలు ఆంక్షలు విధించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top