గృహ రుణాల్లో 8–10 శాతం వృద్ధి

ICRA Estimates That Housing Loan Companies Will Show Growth  - Sakshi

2021–22పై ఇక్రా రేటింగ్స్‌ అంచనా

ముంబై: గృహ రుణ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర వృద్ధిని సాధిస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో హెచ్‌ఎఫ్‌సీలు అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఎటువంటి వృద్ధిని నమోదు చేయలేదని.. రుణాల మంజూరు, వసూళ్ల సామర్థ్యంపై కరోనా రెండో విడత ప్రభావం ఉందని ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ సానుకూల పరిస్థితుల మద్దతుతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి సాధ్యమేనని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. అయితే జూన్‌ చివరి నుంచి వసూళ్ల సామర్థ్యం తిరిగి పుంజుకుందని.. అది సెప్టెంబర్‌ త్రైమాసికంలో మరింత మెరుగుపడిందని తెలిపింది. పరిశ్రమలో డిమాండ్‌ బలంగా ఉండడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, టీకాల కార్యక్రమం విస్తృతం కావడం అన్నవి హెచ్‌ఎఫ్‌సీల నుంచి స్థిరమైన రుణాల మంజూరుకు సాయపడతాయని ఇక్రా పేర్కొంది. 

‘‘హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో (ఆన్‌బుక్‌/పుస్తకాల్లోని రుణాలు) 2021 జూన్‌ చివరికి రూ.11 లక్షల కోట్లుగా ఉంది. గృహ రుణాలు, ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు, నిర్మాణ రుణాలు, లీజ్‌ రెంటల్‌ డిస్కౌంటింగ్‌ వీటిల్లో ఉన్నాయి’’ అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ సచిన్‌ సచ్‌దేవ తెలిపారు. కరోనా కారణంగా 2020–21 సంవత్సరంలో హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో 6 శాతమే వృద్ధి చెందడం గమనార్హం.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top