ఈ ఈక్విటీ ఫండ్‌తో లాభాలొస్తాయా!

ICICI Prudential India Opportunities Fund Direct Growth - Sakshi

 ఈక్విటీల్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్థ్యం, రాబడుల అంచనాలకు అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో అనుకూలమైన విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందులో స్పెషల్‌ సిచ్యుయేషన్‌ కూడా ఒకటి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇండియా అపార్చునిటీస్‌ ఫండ్‌ ఈ విభాగం కిందకే వస్తుంది.  

పెట్టుబడుల విధానం..  
కంపెనీల్లో చోటుచేసుకునే అసాధారణ పరిణామాలను పెట్టుబడుల అవకాశాలుగా ఈ పథకం చూస్తుంది. మంచి అవకాశం అని భావిస్తే ఇన్వెస్ట్‌ చేస్తుంది. టాప్‌ డౌన్, బోటమ్‌ అప్‌ విధానాలను పెట్టుబడులకు అనుసరిస్తుంది. ఇందుకోసం 360 డిగ్రీల కోణంలో పరిశోధన చేస్తుంది. ప్రత్యేక పెట్టుబడి సందర్భాలన్నవి ఎన్నో రూపాల్లో ఎదురవుతుంటాయి. ఆయా కంపెనీ లేదా రంగంలో తాత్కాలిక సంక్షోభం వల్ల స్టాక్స్‌ పడిపోవచ్చు. అంతర్జాతీయ అనిశ్చితులు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంతో దిద్దుబాటుకు లోను కావచ్చు. ఈ పథకానికి ఎస్‌ నరేన్‌ నేతృత్వం వహిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నప్పుడు కొన్ని విభాగాల ఫండ్స్‌ ఆయా స్టాక్స్‌ నుంచి బయటకు వచ్చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఆ సందర్భాలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇండియా అపార్చునిటీస్‌ తరహా పథకాలు అవకాశాలుగా చూస్తుంటాయి. అందుకుని ఈ ఫండ్‌ లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. 

రాబడులు 
ఈ పథకం 2019 జనవరి 15న ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో 42 శాతం రాబడులు ఇవ్వగా.. మూడేళ్లలో వార్షికంగా 19 శాతానికిపైనే రాబడులు తెచ్చి పెట్టింది. ఆరంభం నుంచి చూస్తే.. వార్షిక రాబడి రేటు 20 శాతానికిపైనే ఉంది. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ పథకాలైన లార్జ్‌క్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్‌ పథకాల కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇండియా అపార్చునిటీస్‌ ఫండ్‌ మెరుగైన పనితీరు చూపించడం గమనించాలి. నిఫ్టీ 500 టీఆర్‌ఐ కంటే కూడా ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. ఆరంభంలో రూ.10 ఇన్వెస్ట్‌ చేస్తే 2022 ఏప్రిల్‌ 20 నాటికి రూ.18.46 అయి ఉండేది.  

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,911 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 98 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 44 స్టాక్స్‌ ఉన్నాయి. తన పెట్టుబడుల్లో 64 శాతాన్ని టాప్‌–10 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. 72 శాతం మేర పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌ క్యాప్‌లో 19 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో 9 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పెట్టుబడుల పరంగా ఇంధన రంగ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు అత్యధికంగా 22 శాతం కేటాయింపులు చేసింది. హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 17 శాతం, ఆటోమొబైల్, నిర్మాణ రంగ కంపెనీలలో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. ’’దీర్ఘకాలంలో స్పెషల్‌ సిచ్యుయేషన్‌ పెట్టుబడులు మంచి రాబడులు కురిపిస్తాయి. అయితే స్వల్పకాలంలో అస్థిరతలు ఉండవని చెప్పలేం. ఎన్నో అంచనాలతో చేసిన పెట్టుబడులు మధ్య కాలం నుంచి ఫలితాలు ఇవ్వడం కనిపిస్తాయి’’అని ఎస్‌.నరేన్‌ ఇన్వెస్టర్లకు సూచించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top