స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు | youth finance Low Risk Steady Return Options depending on risk appetite | Sakshi
Sakshi News home page

స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు

Jun 30 2025 8:40 AM | Updated on Jun 30 2025 8:40 AM

youth finance Low Risk Steady Return Options depending on risk appetite

నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్‌

స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒక మార్గం. సేవింగ్స్‌ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్‌డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్‌డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (డీఐసీజీసీ) రూపంలో ఆర్‌బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్‌డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్‌డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. 

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్‌ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్‌ ఫండ్‌లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ అనుకూలం. డెట్‌ ఫండ్స్‌ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్‌ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్‌ కూడా ఎక్కువ. డిపాల్ట్‌ రిస్క్‌ ఉంటుంది.  

నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్స్‌ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామి

ఇండెక్స్‌ ఫండ్‌ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్‌పెన్స్‌ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్‌ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్‌పెన్స్‌ రేషియోకే ఇండెక్స్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్‌ ఎర్రర్‌ను కూడా గమనించాలి.

ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన

ఒక ఇండెక్స్‌ ఫండ్‌.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్‌ ఫండ్‌ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియోతోపాటు.. ట్రాకింగ్‌ ఎర్రర్‌ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి.

-ధీరేంద్ర కుమార్‌, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్‌.

Advertisement
 
Advertisement
Advertisement