స్నాప్‌డీల్‌కు జరిమానా.. ఎందుకో తెలుసా? | Rs 5 Lakh Fine To Snapdeal Know The Details Here | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌కు జరిమానా.. ఎందుకో తెలుసా?

Feb 19 2026 4:30 PM | Updated on Feb 19 2026 4:46 PM

Rs 5 Lakh Fine To Snapdeal Know The Details Here

ఆన్‌లైన్‌లో నాణ్యతా ప్రమాణాలు లేని, ప్రమాదకరమైన బొమ్మలను విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘స్పాప్‌డీల్‌’ (ఏస్‌ విక్టర్‌ లిమిటెడ్‌)పై కేంద్రం కొరడా ఝుళిపించింది.  బీఐఎస్‌ ప్రమాణాలు లేని నాసిరకం బొమ్మలను అమ్మినందుకు గాను  కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. రూ. 5 లక్షల జరిమానా విధించింది.

వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సోమవారం సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే, కమిషనర్‌ అనుపమ్‌ మిశ్రా నేతృత్వంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విచారణలో వెలుగుచూసిన లోపాలు ఇవే.. 
2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘టాయ్స్‌ (క్వాలిటీ కంట్రోల్‌) ఆర్డర్‌ 2020’ను స్నాప్‌డీల్‌ ఉల్లంఘించినట్లు సీసీపీఏ సుమోటోగా గుర్తించింది. అథారిటీ జరిపిన సమగ్ర విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. యాప్‌ నుంచి తొలగించామని చెబుతున్నప్పటికీ.. 2025 డిసెంబర్‌ వరకు నాసిరకం బొమ్మలు ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోనే ఉన్నాయి.

విక్రయిస్తున్న చాలా బొమ్మల వివరాల్లో తయారీదారుల పేరు, చిరునామా, బీఐఎస్‌ నెంబర్‌ వంటి కనీస సమాచారం లేదు. స్టాలిన్‌ ట్రేడింగ్‌ కంపెనీ, త్రిఫ్ట్‌ కార్ట్‌ అనే రెండు విక్రయ సంస్థల ద్వారా ఈ నాసిరకం బొమ్మలను అమ్మించి స్నాప్‌డీల్‌ రూ.41,032 మేర కమీషన్‌ ఫీజులు పొందింది. అమ్మకం దారులు ఇచి్చన సమాచారాన్ని విశ్వసిస్తూ.. ఎలాంటి తనిఖీలు చేయలేదు.

సీసీపీఏ జారీ చేసిన తాజా ఆదేశాలు..
వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాతో పాటు స్నాప్‌డీల్‌కు సీసీపీఏ పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఎలాంటి నాన్‌–బీఐఎస్‌ బొమ్మలను తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబోమని, విక్రయించబోమని హామీ ఇవ్వాలి. వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ వివరాలు, సంప్రదించాల్సిన నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలను వెబ్‌సైట్‌లో స్పష్టంగా, ప్రముఖంగా ప్రదర్శించాలని స్పష్టం  చేసింది. సురక్షితమైన డిజిటల్‌ మార్కెట్‌ను అందించేందుకు నిరంతరం పనిచేస్తామని సీసీపీఏ పునరుద్ఘాటించింది.

స్నాప్‌డీల్‌ వాదనను తోసిపుచ్చిన సీసీపీఏ..
తాము కేవలం షాపింగ్‌ మాల్‌ తరహాలో ఒక ‘ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌‘ మాత్రమేనని, అందులో అమ్మే వస్తువుల నాణ్యతకు తమకు సంబంధం లేదని స్నాప్‌డీల్‌ వాదించింది. అయితే, ఈ వాదనను సీసీపీఏ తీవ్రంగా తోసిపుచ్చింది. ‘తూఫాన్‌ సేల్‌‘ వంటి ప్రమోషనల్‌ ఈవెంట్లను నిర్వహించడం, నాసిరకం వస్తువులకు ‘గ్రేట్‌ క్వాలిటీ‘ అంటూ ట్యాగ్‌లు ఇవ్వడం, డెలివరీలు, రిఫండ్లను నియంత్రిస్తున్నందున ఆ వాదన చెల్లదని స్పష్టం చేసింది. కొనుగోలుదారులకు చేరే వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో ప్లాట్‌ఫామ్‌లదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement