
ఆగస్ట్‌లో రూ.33,430 కోట్ల పెట్టుబడులు
జూలై నెల కంటే 22 శాతం తక్కువ
ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడుల జోరు ఆగస్ట్‌లో కొంత తగ్గింది. రూ.33,430 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జూలైలో రూ.42,702 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2024 ఆగస్ట్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.38,239 కోట్లుగా ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,980 కోట్లు నికరంగా బయటకు వెళ్లాయి. జూలైలో రూ.1.06 లక్షల కోట్ల నికర డెట్ పెట్టుబడులతో పోల్చి చూస్తే భిన్నమైన పరిస్థితి కనిపించింది. దీంతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.75.20 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఈ మొత్తం రూ.75.36 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.
ఆగస్ట్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నీరసించడం వెనుక కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వో) ఆవిష్కరణ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ధోరణుల ఆధారంగా ఆగస్ట్ నెలలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు అధికంగా నమోదవుతాయని ఆశించాం. కానీ, అవి ఫ్లాట్‌గా రూ.28,265 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నప్పటికీ, ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగిస్తున్నా కానీ, భారత ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మార్కెట్లకు ఇంది ఎంతో అనుకూలం’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు.
విభాగాల వారీగా..
ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి అధికంగా రూ.7,679 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.5,330 కోట్లను ఆకర్షించాయి.
స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.4,993 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.3,893 కోట్ల పెట్టుబడులతో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి.
మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌లోకి రూ.3,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.2,835 కోట్లను ఆకర్షించాయి.
23 న్యూ ఫండ్ ఆఫర్లు (కొత్త పథకాలు) ఆగస్ట్‌లో రాగా, ఇవన్నీ కలసి రూ.2,859 కోట్లను సమీకరించాయి.
డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రూ.2,316 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి.హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ డెట్ కలయికతో కూడిన)లోకి పెట్టుబడులు జూలైతో పోలి్చతే ఆగస్ట్‌లో 27 శాతం తగ్గి రూ.15,293 కోట్లుగా ఉన్నాయి.
డెట్ విభాగం నుంచి నికరంగా రూ.7,890 కోట్లను ఇన్వెస్టర్లు ఉపహరించుకున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,350 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.4,950 కోట్లను ఆకర్షించాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,189 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ఆగస్ట్ మాసంలో నికరంగా రూ.52,443 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. జూలైలో వచి్చన రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి.
మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 24.89 కోట్లకు చేరాయి. జూలై చివరికి ఇవి 24.13 కోట్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం!