
కొత్త జీఎస్టీ శ్లాబుల అమలు అప్పటి నుంచే..
భారీగా తగ్గనున్న వాహనాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల ధరలు
వేచి చూసే ధోరణిలో వినియోగదారులు
బైక్‌లు, కార్లు, టీవీలు, ఏసీల కొనుగోళ్లు వాయిదా
పాత జీఎస్టీతో పోలిస్తే 10 శాతం మేర తగ్గనున్న రేట్లు
ఈ–కామర్స్ సైట్లలోనూ ఈ నెల 22 తర్వాతే ఆఫర్లు
నగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటో మొబైల్స్, ఎల్రక్టానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్‌ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ నెల 22 వరకూ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఈ– కామర్స్ సంస్థలు కూడా ఈ నెల 22 తర్వాతే ఆఫర్లను అందించేందుకూ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్‌లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
18 నుంచి 5 శాతానికి..
గతంలో జీఎస్టీలో ఐదు శ్లాబులు ఉండగా.. తాజాగా కేంద్రం వీటిని రెండింటికి కుదించింది. విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 10 శాతం జీఎస్టీ శ్లాబును విధించింది. ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం వరకు ఉన్నాయి. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్ 18 శాతానికి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి కూడా తగ్గే అవకాశముంది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎల్రక్టానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్ వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులపై కూడా కేంద్రం జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది షోరూమ్‌లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం ఈ నెల 22 తర్వాతే చేద్దామనే అభిప్రాయానికి వస్తున్నారని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి.
తగ్గనున్న వాహనాల ధరలు..
సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఆటో మొబైల్స్‌పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. కొత్త జీఎస్టీ శ్లాబ్‌లో ఇది 18 శాతానికి తగ్గింది. ఏకంగా 10 శాతం మేర జీఎస్టీ తగ్గుతుంది. దీంతో మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు, బైక్‌పై రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. దీంతో వాహన కొనుగోలుదారులు కొనుగోళ్లను మరో రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నారు. వాహన షోరూమ్‌లో గిరాకీ తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చని భావిస్తున్నారు.
ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు సైతం..
స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్‌వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా కేంద్రం జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించింది. ఇప్పటివరకు వీటిపై 28 శాతం పన్ను విధించగా, ఇప్పుడవి 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీలపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.
ఈ– కామర్స్ ఆఫర్లూ అప్పుడే..
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ–కామర్స్ కొనుగోలుదారులు సైతం ఈ నెల 22 డెడ్‌లైన్ విధానానికే జై కొడుతుండటంతో.. కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను సైతం నిలిపివేశాయి. దీంతో సాధారణంగా డైలీ, వీక్లీ ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్ కస్టమర్లను ఆకర్షించే ఈ–కామర్స్ సంస్థలు.. తమ మెగా ఆఫర్లను ఈ నెల 22 తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్