టాప్‌గేర్‌లో హైదరాబాద్‌

Hyderabad sees 308percent jump in housing sales - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ టాప్‌గేర్‌లో పడింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 308 శాతం వృద్ధి నమోదయింది. 2021 క్యూ3లో 6,735 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ2లో ఇది 3,240 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 108 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో నగరంలో 1,650 గృహ విక్రయాలు జరిగాయి. కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. 2021 క్యూ3లో 14,690 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. క్యూ2లో 8,850 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. త్రైమాసికంతో పోలిస్తే 66 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో 4,900 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంతో పోలిస్తే 67 శాతం వృద్ధి రేటు.

► కరోనా మహమ్మారి నుంచి హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ మొదలవుతుండటంతో, ఐటీ/ఐటీఈఎస్‌ రంగాలలో నియామకాలు జోరందుకోవటం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్ల ఆకర్షణీయమైన పథకాలు.. కారణాలేవైనా నగర రియల్టీ రంగంలో జోష్‌ నెలకొంది. నిర్మాణ కారి్మకులలో కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావటంతో నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్వెంటరీ, నిర్మాణంలో ఉన్న గృహాలను విక్రయిం చడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో 67 శాతం వృద్ధి నమోదయితే, విక్రయాల్లో మాత్రం 308 శాతం పెరుగుదల కనిపించింది. కొనుగోలుదారులు పెద్ద సైజు గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.

దేశవ్యాప్తంగా 62,800 ఇళ్ల విక్రయం..
హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ3లో 62,800 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్యూ2లో 24,560 యూనిట్లు సేల్‌ అయ్యాయి. అంటే క్యూ2తో పోలిస్తే 156 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో చూస్తే 29,520 ఇళ్లు విక్రయమయ్యాయి. అంటే 113 శాతం పెరుగుదల.

► ఇక కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. ఈ ఏడాది క్యూ3లో మొత్తం 64,560 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. క్యూ2లో 36,260 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే గత త్రైమాసికంతో పోలిస్తే 78 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో 32,530 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. అంటే ఏడాదితో పోలిస్తే 98 శాతం వృద్ధి రేటు. ఈ ఏడాది క్యూ3లోని లాంచింగ్స్‌లలో రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్యస్థాయి ఇళ్ల వాటా 41 శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ప్రీమియం గృహాల వాటా 25 శాతం, రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్‌ హౌసింగ్‌ వాటా 24 శాతంగా ఉన్నాయి.

► నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో 2021 క్యూ3లో ధరలు 3 శాతం మేర పెరిగాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చ.అ. ధర సగటున రూ.5,760గా ఉంది. గతేడాది క్యూ3లో చ.అ. సగటు ధర రూ.5,600గా ఉండేది.

► ప్రాపరీ్టలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్‌ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్‌లైన్‌ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ బృందం ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుతం నిలబడగలుగుతారు.

ఒక్క మన నగరంలోనే..
ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌ మినహా ఏ నగరంలోనూ 130 శాతం వృద్ధి రేటు నమోదు కాలేదు. గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో నగరంలో ఇళ్ల అమ్మకాలలో 308 శాతం పెరుగుదల కనిపించగా.. ముంబైలో 128 శాతం, చెన్నైలో 113 శాతం, పుణేలో 100 శాతం, కోల్‌కతాలో 99 శాతం, ఎన్‌సీఆర్‌లో 97 శాతం, బెంగళూరులో 58 శాతం వృద్ధి రేటు నమోదయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top