హైదరాబాద్‌ ఆఫీస్‌ లీజింగ్‌లో రికార్డు.. | Hyderabad office leasing records Knight Frank India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఆఫీస్‌ లీజింగ్‌లో రికార్డు..

Oct 12 2026 4:59 PM | Updated on Oct 12 2026 5:06 PM

Hyderabad office leasing records Knight Frank India

దేశీయ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ మరోసారి తన సత్తా చాటింది. నగరంలో కార్యాలయ స్థలాల అద్దె ఒప్పందాలు (ఆఫీస్‌ లీజింగ్‌) 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఏకంగా 13.1 మిలియన్‌ చదరపు అడుగులకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 8.8 మిలియన్‌ చదరపు అడుగులతో పోలిస్తే ఇది 50 శాతం అధికం.

అంతేకాదు, 2026లో తొలి తొమ్మిది నెలల్లోనే 2025 పూర్తి ఏడాది లీజింగ్‌ పరిమాణాన్ని అధిగమించింది. 2019లో నమోదైన 12.8 మిలియన్‌ చదరపు అడుగుల గత గరిష్ఠ స్థాయినీ దాటింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అక్టోబర్‌ 12న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోని ఎనిమిది ప్రధాన కార్యాలయ మార్కెట్లలో జరిగిన మొత్తం లీజింగ్‌లో హైదరాబాద్‌ వాటా 20 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ వాటా 13 శాతంగా ఉండటం గమనార్హం.

క్యూ3లోనూ జోరు..

2026 తొలి మూడు త్రైమాసికాల్లో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో 5.9 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్లగా, ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 1.7 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో మళ్లీ పుంజుకుని 5.6 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే క్యూ3 లీజింగ్‌ 92 శాతం పెరిగింది. దేశంలోని ఎనిమిది ప్రధాన మార్కెట్లలో ఆ త్రైమాసికంలో జరిగిన మొత్తం ఆఫీస్‌ లీజింగ్‌లో హైదరాబాద్‌ ఒక్కటే 30 శాతం వాటాను సాధించింది. దీంతో కొత్త కార్యాలయ స్థలాల కోసం కంపెనీల నుంచి డిమాండ్‌ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది.

జీసీసీలదే కీలక పాత్ర

హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వృద్ధిలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2026 తొలి తొమ్మిది నెలల్లో జీసీసీలు హైదరాబాద్‌లో 6.2 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 70 శాతం వృద్ధి. నగరంలోని మొత్తం ఆఫీస్‌ లీజింగ్‌లో జీసీసీల వాటా 47 శాతానికి చేరింది. 2025 ఇదే కాలంలో ఈ వాటా 42 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన జీసీసీ లీజింగ్‌లో హైదరాబాద్‌ వాటా కూడా 15 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది.

ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ సంస్థల విస్తరణ కూడా ఈ వృద్ధికి దోహదపడింది. కో-వర్కింగ్‌, సౌకర్యవంతమైన అద్దె కార్యాలయాలను అందించే ఈ సంస్థలు 2026 జనవరి–సెప్టెంబర్‌ మధ్య 3.5 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ పరిమాణం రెండున్నర రెట్లు పెరిగింది. నగర మొత్తం లీజింగ్‌లో వీటి వాటా 26 శాతానికి చేరింది. మరోవైపు, థర్డ్‌ పార్టీ ఐటీ సేవల సంస్థలు 2.9 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని తీసుకోగా, భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న వ్యాపార సంస్థల వాటా 0.5 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.

కొత్త భవనాలు పెరిగినా.. తగ్గిన ఖాళీ కార్యాలయాలు

నగరంలో కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం గణనీయంగా పెరిగింది. 2026 తొలి తొమ్మిది నెలల్లో 9.7 మిలియన్‌ చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలం అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 3 మిలియన్‌ చదరపు అడుగులే. అంటే కొత్త సరఫరా 219 శాతం పెరిగింది. ఒక్క క్యూ3లోనే 6.7 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలం మార్కెట్‌లోకి వచ్చింది.

అయితే, కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల శాతం తగ్గడం మార్కెట్‌లోని డిమాండ్‌ను సూచిస్తోంది. 2025 క్యూ3లో 13.3 శాతంగా ఉన్న ఖాళీ కార్యాలయాల రేటు 2026 క్యూ3 నాటికి 11.8 శాతానికి పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలో 1.5 శాతం పాయింట్లు తగ్గింది. కొత్త సరఫరాలో గణనీయమైన భాగాన్ని కంపెనీలు వినియోగించుకుంటున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

అద్దెలూ పైపైకి..

కార్యాలయ స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ అద్దెలపైనా ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో 2026 క్యూ3లో చదరపు అడుగు కార్యాలయ స్థలానికి సగటు నెలవారీ అద్దె రూ.82కు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.75.50గా ఉంది. అంటే ఏడాదిలో అద్దెలు 9 శాతం పెరిగాయి. మరోవైపు, తొలి తొమ్మిది నెలల్లో జరిగిన మొత్తం లీజింగ్‌లో గ్రేడ్‌-ఏ కార్యాలయ స్థలాల వాటా 97 శాతంగా నమోదైంది. ఆధునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు కలిగిన నాణ్యమైన కార్యాలయాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇది తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement