
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్‌గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.
కార్పొరేట్ కార్యక్రమాలు
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్‌లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.
విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్‌లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..
ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.
ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.
లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్‌లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.
లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.
మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).
అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్‌లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్‌గా మార్చాయి.
భవిష్యత్ ప్రణాళికలు
జగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్‌గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్‌కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రణాళికలు ఇలా..
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్‌క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.
ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..