హైదరాబాద్‌‌లో దుమ్ములేపిన ఇళ్ల అమ్మకాలు!

Housing Sales Increase Hyderabad By 87 Percent In 2022 - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది 25,406 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 47,487 యూనిట్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యధికంగా 3,64,900 యూనిట్లు అమ్మడయ్యాయి. గతేడాది (2021)తో పోలిస్తే ఈ ఏడాది ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 54 శాతం పెరిగాయి.

2021లో విక్రయాలు 2,36,500 యూనిట్లుగా ఉన్నాయి. 2014లో నమోదైన 3.43 లక్షల యూనిట్ల అమ్మకాలే ఇప్పటి వరకు గరష్ట రికార్డుగా ఉంటే, ఈ ఏడాది అమ్మకాలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు బలమైన డిమాండ్‌ నెలకొందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తెలిపింది.

నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌ ధరలు పెరిగిన ఫలితంగా ఇళ్ల ధరలు ఈ ఏడాది 4–7 శాతం వరకు ఎగసినట్టు అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. హైదారాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ముంబై ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.  

ముంబై ఎంఎంఆర్‌ మార్కెట్లో 1,09,700 యూనిట్ల ఇళ్ల విక్రయాలు జరిగాయి. 2021లో ఇక్కడ అమ్మకాలు 63,712 యూనిట్లుగానే ఉన్నాయి.  

పుణెలో గతేడాదితో పోలిస్తే 59 శాతం అధికంగా 57,146 యూనిట్లు విక్రయమయ్యాయి.  

బెంగళూరులో 50 శాతం అధికంగా 49,478 యూనిట్ల విక్రయాలు జరిగాయి.  

చెన్నైలో 29 శాతం పెరిగి 16,097 యూనిట్లు అమ్మడయ్యాయి.  

కోల్‌కతా మార్కెట్లో గతేడాది 13,077 యూనిట్లు అమ్ముడైతే, ఈ ఏడాది 21,220 ఇళ్ల విక్రయాలు జరిగాయి.  

ఏడు పట్టణాల్లో 3,57,600 యూనిట్ల కొత్త ఇళ్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఉన్న 2,36,700 యూనిట్లతో పోలిస్తే 51 శాతం అధికం. 

ఈ ఏడాది హైదరాబాద్, ఎంఎంఆర్‌ మార్కెట్లలో కొత్త ప్రాజెక్టుల ఆరంభాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడు పట్టణాలకు గాను ఈ రెండింటి వాటాయే 54 శాతంగా ఉంది. 

అమ్ముడుపోని ఇళ్ల విక్రయాలు డిసెంబర్‌ త్రైమాసికంలో 1 శాతం తగ్గి 6,30,953 యూనిట్లుగా ఉన్నాయి. 

ప్రధానంగా 2020, 2021లో కరోనా మహమ్మారి కారణంగా ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకున్న వారు కూడా ఈ ఏడాది కొనుగోళ్లకు మొగ్గు చూపడం కలిసొచ్చింది. 

అద్భుతమైన సంవత్సరం   
‘‘నివాస గృహాలకు ఈ ఏడాది అద్భుతంగా ఉంది. ప్రాపర్టీల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ సానుకూల విక్రయాలు నమోదయ్యాయి. 2022 ద్వితీయ ఆరు నెలల్లో ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం అన్నది విక్రయాలపై ప్రభావం పడుతుందని ముందు నుంచి అంచనా నెలకొంది. అయినప్పటికీ డిసెంబర్‌ క్వార్టర్‌లో బలంగా 92160 యూనిట్ల విక్రయాలు జరిగాయి’’అని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. 

చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top