
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నికర లాభం గతేడాది (2024–25) 38 శాతం జంప్‌చేసి రూ. 3,727 కోట్లకు చేరింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం కాగా.. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది (2023–24)లో రూ. 2,705 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 39,238 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 31,945 కోట్ల టర్నోవర్ సాధించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. జపనీస్ ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్‌కు చెందిన దేశీ అనుబంధ అన్‌లిస్టెడ్ సంస్థ ఇది.
ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ (ఎఫ్‌ఏడీఏ) వివరాల ప్రకారం.. గతేడాది రిటైల్‌గా 1,88,77,812 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. వీటిలో హోండా మోటార్‌సైకిల్ రిటైల్ అమ్మకాలు 47,89,283 యూనిట్లుగా నమోదయ్యాయి. వెరసి హీరో మోటోకార్ప్(54,45,251 యూనిట్లు) తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలిచింది. కాగా.. 2030కల్లా దేశీ ద్విచక్ర వాహన మార్కెట్లో 30 శాతం వాటాపై హోండా మోటార్‌సైకిల్ కన్నేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.