హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ బ్లాక్‌బస్టర్‌ లిస్టింగ్

Happiest minds lists with huge premium in NSE and BSE - Sakshi

రూ. 185 లాభంతో రూ. 351 వద్ద ట్రేడింగ్‌ షురూ 

ఇష్యూ ధర రూ. 166- ఇష్యూకి 151 రెట్లు అధిక స్పందన

రూ. 702 కోట్లు సమీకరించిన కంపెనీ

సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో బంపర్‌ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 166 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా రూ. 351 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 185(111 శాతం) లాభం కాగా.. ప్రస్తుతం రూ. 366 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 395 వద్ద గరిష్టాన్ని, రూ. 350 వద్ద కనిష్టాన్నీ తాకింది. హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ ఐపీవో ఇటీవల ఎరుగని విధంగా 151 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన సంగతి తెలిసిందే . ఇటీవల చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కంపెనీ 2.33 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 351 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 702 కోట్లు సమీకరించింది. రిటైల్‌ విభాగంలోనే 71 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖాలు కావడం విశేషం!

బ్యాక్‌గ్రౌండ్..‌
దేశీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్‌ సూతా 2011లో హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్‌, సెక్యూరిటీ, అనలిటిక్స్‌ విభాగాలలో సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో  రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్‌ టెక్నాలజీస్‌ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌, ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top